Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కలవరపెడుతోంది. ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపడుతుండటం, దీనికి ప్రజా మద్దతు ఉండటంతో అక్కడి ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ ను, అతని పార్టీ పీటీఐని దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు కేసుల్లో కోర్టుల నుంచి రక్షణ పొందుతున్న ఇమ్రాన్ ఖాన్ ను మిలిటరీ కోర్టులో విచారించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత మే 9న పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై సైనిక కోర్టులో విచారణ చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
Read Also: Tiananmen Square: సొంత ప్రజల పైన చైనా మారణహోమానికి 34 ఏళ్లు..
మే 9న సైనిక, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసిన కేసులో ఇమ్రాన్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే మే 9 ఘర్షణలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఏదైనా ఆధారాలు బయటపడితే సైనిక కోర్టులో విచారించే అవకాశం ఉంది. ఒక మాజీ ప్రధానిని సైనిక కోర్టులో విచారించే అవకాశం ఉందా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. తప్పకుండా విచారించే అవకాశం ఉందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
అంతకుముందు మే 9 అల్లర్లకు ముఖ్య కారణం ఇమ్రాన్ ఖాన్ అని హోంమంత్రి రాణా సనావుల్లా అన్నారు. ఈ ఆందోళన సమయంలో రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కార్ప్స్ కమాండర్ నివసించే లాహోర్‌లోని జిన్నా హౌస్‌పై దాడి చేయడంతో పాటు దేశంలోని వివిధ ఆర్మీ కంటోన్మెంట్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. అంతకుముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ..మే 9 దాడులకు పాల్పడినవారు, ప్లాన్ చేసినవారిని ఆర్మీ చట్టం కింద విచారిస్తామని, వారి పట్ల ఉదాసీనత చూపబోం అని అన్నారు. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో తన ప్రమేయం లేదని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను జైలులో ఉన్నానని, ప్రభుత్వమే కావాలని తనపై దేశద్రోహం కేసు నమోదు చేసి, పదేళ్లు జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.