Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. ఈ హత్య కుట్రలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని, భారత్‌కి చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తిపై అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వంలోని ఉద్యోగి హ్యండ్లర్‌గా వ్యవహరిస్తూ.. పన్నూ హత్యకు ప్రణాళిక వేశాడని అమెరికన్ న్యాయశాఖ నేరారోపణ పత్రాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని చెబుతూ కెనడా ఆరోపించింది. తాజాగా అమెరికా కూడా ఆరోపణలు చేస్తుండటంతో కెనడా మరింతగా స్వరాన్ని పెంచింది. అయితే ఈ రెండు దేశాల ఆరోపణల్ని భారత్ కొట్టిపారేసింది.
Read Also: Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్‌దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..
తాజాగా ఈ వ్యవహారంపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం మాట్లాడారు. నిజ్జర్ హత్య దర్యాప్తులో భారత్ పాల్గొనడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలను భారత్ నుంచి తొలగించడాన్ని ఆమోదయోగ్య నిర్ణయం కాదని ఆమె చెప్పారు. ‘‘భారత్‌తో మేము ఎదుర్కొంటున్న సమస్యలపై నా అమెరికన్ సహచరులతో, సెక్రటరీ బ్లింకెన్‌తో అనేక సార్లు మాట్లాడానని, అదే సమయంలో దర్యాప్తులో నిమగ్నం కావాలని మేము భారత్‌ని పిలుస్తామని, ఇది ముఖ్యమైందిగా భావిస్తున్నాము’’ అని మెలానీ జోలి అన్నారు. భారత్‌పై ‘విశ్వసనీయ ఆరోపణ’కు దేశం అండగా ఉంటుందని ఆమె అన్నారు.
భారత ప్రధానమంత్రిని, వారి న్యాయవ్యవస్థను గౌరవిస్తాను, అయితే కెనడియన్ గడ్డపై ఓ కెనడా పౌరుడిని చంపడం భారత్ ఏజెంట్లతో ముడిపడి ఉందనే విశ్వసనీయ ఆరోపణలకు మేము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. ఈ అంశంపై భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మా దర్యాప్తుకు సహకరించాలని భారత్‌ని కోరుతున్నామని ఆమె చెప్పింది.
బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని సర్రే నగరంలో గురుద్వారా ముందు ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్థ చీఫ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే భారత్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తూ.. కెనడావి అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణని చెప్పింది.