Paskistan Economic Crisis: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. పతనం అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటిస్తే తప్పా.. పాక్ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. అయితే ఐఎంఎఫ్ షరతులకు పాకిస్తాన్ అంగీకరిస్తేనే అప్పు వస్తుంది. పాకిస్తాన్ 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఈ షరతుల గురించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయి, కానీ వాటికి తలొగ్గాల్సిందే అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచనున్న కేంద్రం
భారీగా ఉన్న ఆర్థిక అంతరాలను పూడ్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు పాకిస్తాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోలియం లెవీని లీటర్ కు రూ. 20-30కి పెంచాలని ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం ఉన్న రూ.50కి అదనం. దీంతో పెట్రోల్ పై పన్నులు రూ. 70-80 కి చేరుకుంటాయి. రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, ల్యూబ్రికెంట్(పీఓఎల్) ఉత్పత్తులపై 17 శాతం జీఎస్టీ విధించాలనేది మరో షరతు. చక్కెర పానీయాలపై ఫెడరల్ ఎక్సైజ్ డ్యూటీని 13 శాతం నుంచి 17 శాతానికి పెంచాల్సి ఉంటుంది. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచాలని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సూచించింది. ఇదిలా ఉంటే సబ్సిడీల ఎత్తేయాలని, విద్యుత్ టారిఫ్ లు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద కేవలం 3.09 బిలియన్ డాలర్ల విదేశీమారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాలకు మాత్రమే సరిపోతాయి. ఇప్పటికే అక్కడి ప్రజలు తీవ్రమైన ధరలతో అల్లాడుతున్నారు. పిండి, నెయ్యి, వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐఎంఎఫ్ షరతులతో మరింత కష్టాల్లో పడగనున్నారు పాకిస్తాన్ ప్రజలు