వ్యాపార కేంద్రంలో బాంబ్ పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన పాకిస్థాన్ కరాచీలోని ఖరద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పేలుడు సోమవారం రాత్రి సంభవించింది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ తో పాటు దాదాపు 12 మంది వ్యక్తులకు గాయాలైనట్లు అధికారు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో.. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ పేలుడు కోసం దుండగులు మోటారు సైకిల్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని అమర్చినట్లు పోలీసులు నిర్థారించారు. పేలుడు జరిగిన స్థలం వద్ద మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే.. ఈ పేలుడు జరిగిన ఖరదర్ ప్రాంతం ఎప్పుడూ జనంతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతం నగరంలోనే వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడి వ్యాపారులు ఎక్కువగా ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఇతర మెటీరియల్‌ల అమ్మకాలు సాగిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన విషయంలో కరాచీ అడ్మినిస్ట్రేటర్ ముర్తాజా వాహబ్ మాట్లాడుతూ.. పేలుడు వల్ల ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.