Germany: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో గత 12 గంటల నుంచి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు కారుతో విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు, గన్ తో కాల్పులు జరపడమే కాకుండా, పెట్రోల్ బాంబులను విసిరాడు. అయితే గత 12 గంటలుగా దుండగుడితో చర్చించేందుకు హాంబర్గ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు తీసుకువచ్చిన కారులో అతనితో పాటు 4 ఏళ్ల అమ్మాయి కూడా ఉన్నారు. కారును విమానం కింద నిలిపి ఉంచాడు. పాప, 35 ఏళ్ల దుండగుడి కూతురే అని తేల్చారు.
Read Also: Amit Shah: కులగణనలో ముస్లింలు, యాదవుల జనాభాను ఉద్దేశపూర్వకంగా పెంచారు.
కుటుంబ వివాదం కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. తన కుమార్తెను అపహరించుకెళ్లాడని, అతని భార్య పోలీసులకు ఫోన్ చేసింది. తన కూతురిని బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పింది. అయితే నిందితుడి వద్ద నాలుగేళ్ల పాప ఉండటంతో భద్రతా బలగాలు రిస్క్ చేయడం లేదు. చర్చల ద్వారా అతని నుంచి బాలికను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానసిక సమస్యలు ఉండటంతో, సైకాలజిస్టుల సాయం తీసుకుంటున్నారు.
ఈ ఘటన తర్వాత టర్కీష్ ఎయిర్ లైన్స్ విమానంతో పాటు ఇతర ఎయిర్ లైన్స్ కి చెందిన విమానాలను ఎయిర్ పోర్టు వర్గాలు ఖాళీ చేయించాయి. అధికారులు టెర్మినల్ భవనాలను క్లియర్ చేశారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుండటంతో ఈ రోజు 60కి పైగా విమానాలు రద్దు చేశారు. 3000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు.