G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!

  • జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు!
  • చమురుపై కీలక చర్చ!
G71

G71

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగేటట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షోభంపై చర్చించేందుకు జీ 7 దేశాలు అత్యవసర సమావేశం అవుతున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ మీటింగ్ ద్వారా చమురు నిల్వల విడుదలపై చర్చించనున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతే కాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు నిల్వలు పడిపోతున్నాయి. దీంతో సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జీ 7 దేశాలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు అయిన భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల తాత్కాలికమని పేర్కొన్నారు. ఇరాన్ అణు ముప్పును నిర్మూలించే ప్రయత్నాలు పూర్తయిన తర్వాత ధరలు తగ్గుతాయని అన్నారు.

అయితే గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో మార్కెట్‌ను స్థిరపరచడానికి జీ7 దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించి చమురు నిల్వలను విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించనున్నాయి.

ఇది కూడా చదవండి: Vijay: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. హీరో విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసు