Imran Khan Arrest: అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ రేంజర్లు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని పీటీఐ దేశప్రజలకు పిలుపునిచ్చింది. ఇక దేశరాజధాని ఇస్లామాబాద్ అంతటా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో నిషేధిత ఆర్డర్స్ పాస్ చేశారు.
దేశద్రోహం, దైవదూషణ, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, అవినీతి ఇలా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పై 121 కేసులు నమోదు అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పై లాహోర్ నగరంలో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్ 14 కేసులు, దేశవ్యాప్తంగా 22 ఉగ్రవాద కేసులు నమోదు అయ్యాయి. వీటిపై ఆయన న్యాయపరంగా పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఆయన ఇస్లామాబాద్ కోర్టుకు హాజరైన సమయంలో పాక్ పారామిలిటరీ రేంజర్లు న్యాయస్థానంలోకి వెళ్లి, ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేశారు.
Read Also: Sachin Pilot: సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియా గాంధీ కాదు వసుంధర రాజే..
అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్:
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ పేరున ఉన్న ‘‘అల్ ఖదీర్ ట్రస్ట్’’కు రూ.53 కోట్ల విలువైన భూమని బహీరీ పట్టణంలో కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూర్’(ఎన్ఏబీ) అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ హోం మంత్రి రానా సనావుల్లా అధికారికంగా ప్రకటించారు. దేశ ఖజానాకు నష్టం కలిగించేలా చేసినందుకు ఎన్ఏబీ అరెస్ట్ చేసిందని, ఇమ్రాన్ ఖాన్ పై దాడి జరగలేదని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ కేసులో సంబంధిత కోర్టులో హాజరుకావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. ఇమ్రాన్ ఖాన్ లెక్కచేయలేదని మంత్రి వెల్లడించారు.
దీంతో పాటు ఇమ్రాన్ భార్య, ఇతర క్యాబినెట్ మంత్రులు అందుకున్న బహుమతులకు సంబంధించి వాస్తవి విలువను బహిర్గతం చేయడకపోవడంతో ఎన్ఏబీ నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్ అందుకున్న అందుకున్న బహుమతుల వాస్తవ విలువకు, అమ్మకానికి మధ్య వ్యత్యాసం ఉందని తెలిపింది. అయితే తాజాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన కేసు ఈ రోజు జాబితా చేయబడలేదు.