అంతర్జాతీయ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. నార్డిక్ దేశమైన ఫిన్లాండ్ తీరుపై రష్యా మండిపడుతోంది. ఫిన్లాండ్ త్వరలో నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. వెంటనే నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని వారిద్దరూ పిలుపునిచ్చారు. రానున్న మరికొన్నిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని వెల్లడించారు. ఫిన్లాండ్ చేరికతో నాటో కూటమి కూడా బలోపేతం అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిన్లాండ్ పార్లమెంట్, సీనియర్ రాజకీయ నాయకులు పరిశీలించిన తర్వాత ఆదివారం నాటో అంశంపై ఓ ప్రకటన రానుందని భావిస్తున్నారు.
అదే రోజు స్వీడన్ కూడా నాటోలో చేరికపై నిర్ణయం తీసుకోనుంది. రష్యా ఈ పరిణామాలపై ఆగ్రహంతో వుంది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీని వీడితే తీవ్ర పరిణమాలు తప్పవని, సైనిక కూటముల్లో చేరడంపై స్వీడన్, ఫిన్లాండ్‌లు ఆలోచించుకోవాలని రష్యా పేర్కొంది. రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా స్వీడన్, ఫిన్లాండ్‌లు నాటోలో చేరితే ఏమవుతుందో చెప్పాం. కానీ వారు చేరేందుకు రెడీ అయితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. గతంలో నాటో వైపు చూసిన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. స్వీడన్ నాటోలో చేరితే రష్యా ఎలా స్పందిస్తుందో, ఉక్రెయిన్ తరహా పరిణామాలు తప్పవేమో అని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్‌లో నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫిన్లాండ్ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 76శాతం మంది నాటోలో చేరేందుకు మొగ్గు చూపారు. మరి ప్రజల అభిప్రాయానికి ఓకే అంటారో, రష్యా హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గుతారో చూడాలి.
Hyderabad:యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి