Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే అరేబియా ద్వీపకల్పాన్ని, హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి వేరు చేసే వ్యూహాత్మక బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు జరిగినట్లు బ్రిటీష్ సముద్ర భద్రతా ఏజెన్సీ యూకేఎంటీఓ నివేదించింది. ఈ జలసంధిలో ప్రయాణిస్తున్న కార్గో షిప్‌కి 1-5 నాటికన్ మైళ్ల దూరంలో ఎరిత్రియా-యెమెన్ మధ్య మూడు పేలుళ్లు సంభవించినట్లు ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈ పేలుళ్ల వల్ల నౌకకి కానీ, అందులో సిబ్బందికి కానీ ఎలాంటి ప్రమాదం కలగలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Insurance Money: కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్నేహితుడినే చంపేశాడు..
గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ నౌకయానానికి ఎంతో కీలకమైన రెడ్ సీ- గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌ని కలిపే వ్యూహాత్మక ప్రాంతాల్లో హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతు ఉందని అమెరికా ఆరోపిస్తోంది. గతంలో ఇండియా వైపు వస్తున్న నౌకలపై కూడా దాడులు జరిగాయి. హౌతీలు డ్రోన్లు, రాకెట్లతో నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు యూఎస్, ఫ్రెంచ్, బ్రిటీష్ యుద్ధనౌకలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ, నౌకలకి రక్షణ ఇస్తున్నాయి. అరేబియా సముద్రంలో నౌకలకు రక్షణగా భారతదేశం కూడా ఇండియన్ నేవీని పంపింది. ఈ దాడుల వల్ల ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం వరకు రవాణా జరిగే సముద్ర మార్గం ప్రభావితం అవుతోంది.