Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎర్ర సముద్రం రణరంగంగా మారుతోంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్రం గుండా వచ్చే వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు అమెరికా మిలిటరీ ఆ ప్రాంతంలో మోహరించింది. రెడ్ సీలో కంటైనర్ షిప్‌లపై దాడులు చేస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగబాటుదారులు నిర్వహిస్తున్న మూడు నౌకల్ని ముంచేసినట్లు యూఎస్ నేవీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు వీటిపై దాడి చేసినట్లు ఆదివారం వెల్లడించింది.