Eric Trump: ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. మమ్దానీపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయులను ద్వేషిస్తాడు’’ అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అమెరికా నగరాల్లో వామపక్ష భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల అమెరికన్ నగరాల్లో పెద్ద కంపెనీలు కష్టాల్లో పడుతున్నాయని చెప్పారు. ఒకప్పడు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా న్యూయార్క్ ఉండేదని, ఇప్పుడు రాజకీయాల వల్ల ఈ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
Read Also: Saailu: నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా – డైరెక్టర్ షాకింగ్ ఛాలెంజ్
మమ్దానీని టార్గెట్ చేస్తూ.. ఆయనను సోషలిస్ట్, కమ్యూనిస్ట్ అని పిలిచారు. గ్రాసరీ సోర్లను జాతీయీకరించాలని అనుకుంటున్నాడని ఆరోపించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాడని, యూదులు, భారతీయులను ద్వేషిస్తాడని చెప్పారు. మమ్దానీ సురక్షిత వీధులు, శుభ్రత, పన్నులపై దృష్టి పెట్టాలని ఎరిక్ ట్రంప్ సూచించారు. మమ్దానీని లెఫ్టిస్ట్ నేత అలెగ్జాండ్రియా ఓకాసియో-కోర్టెజ్‌గా పోల్చారు. ఆమె కారణంగా న్యూయార్క్‌లో అమెజాన్ తన ప్రధాన కార్యాలయాన్ని పెట్టలేకపోయిందని గుర్తు చేశారు.
ఇటీవల, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ నగరానికి కాబోతున్న దక్షిణాసియా సంతతికి చెందిన తొలి మేయర్ ఇయనే. తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. 100 ఏళ్ల తర్వాత న్యూయార్క్ కు కాబోతున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కారు. మమ్దానీ జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. పాలస్తీనాపై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడని, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ న్యూయార్క్‌కు వస్తే అరెస్ట్ చేయిస్తానని మమ్దానీ హెచ్చరించడం సంచలనంగా మారింది.