Earthquake Strikes Pacific Nation Of Vanuatu: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ దేశం అయిన వనౌటు తీరానికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు 7.0 తీవ్రతతో 27కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్ర పోర్ట్-ఓల్రీ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.
Read Also: Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. కొన్ని తీరాల్లో అలల స్థాయి 0.3 నుంచి ఒక మీటర్ వరకు సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. న్యూ కాలెడోనియా, సోలమన్ దీవుల్లో 0.3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
పసిఫిక్ తీరంలో చిన్న ద్వీపదేశం అయిన వనౌటు. ఈ దేశం పసిఫిక్ ప్రాంతంలో ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. పరస్పరం ఈ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్ల తరుచుగా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం జరుగుతుంది. అంతకుముందు గతేడాది నవంబర్ లో సోలమన్ దీవులకు సమీపంలో 7.0 భూకంపం సంభవించింది. ఆ సమయంలో రాజధాని హోనియారాలో కొన్ని ప్రాంతాల్లో భూకంప ప్రకంపన ధాటికి విద్యుత్ స్తంభాలు, కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.