Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. అధికార డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ని ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. తాజాగా కమలా హరిస్‌ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చికాగోలో జరిగిన నల్లజాతి జర్నలిస్టుల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ జాతి గుర్తింపుపై ప్రశ్నించారు. కమలా హారిస్ చీరకట్టులో ఉన్న ఓ ఫోటోలని పంచుకున్నారు. ఆమె భారతీయ-నల్లజాతి మూలాలపై గందరగోళం వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని డెమొక్రాట్లు, వైట్ హౌజ్ తీవ్రంగా తప్పుపట్టింది.
డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ వారసత్వాన్ని ప్రశ్నించారు. ఆమె భారతీయురాలా..?, నల్లజాతీయురాలా..? అని అడిగారు. ఆమె తన వారసత్వ గుర్తింపును మార్చిందని విమర్శించారు. సాంప్రదాయ భారతీయ చీరతో ఉన్న ఆమె ఫోటోని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరమైనవని వైట్ హౌజ్ ఖండించింది. కమలా హారిస్ తన భారతీయ-నల్లజాతీ వారసత్వాన్ని నొక్కి చెప్పింది.
Read Also: Paris Olympics 2024: 58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో అరంగేట్రం.. కల నెరవేర్చుకున్న బామ్మ!
చికాగో సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇంత కాలం హారిస్ నల్ల జాతీయురాలని తెలియదు’’ అని ఆమెని విమర్శించారు. ‘‘ చాలా ఏళ్ల క్రితం మీరు పంపిన ఫోటోకి ధన్యవాదాలు కమలా. మీ భారతీయ వారసత్వం పట్ల మీ ఆప్యాయత, ప్రేమ చాలా ప్రశంసనీయం. ఆమె ఎల్లప్పుడు భారతీయ వారసత్వాన్ని ప్రచారం చేసింది. ఆమె కొన్నేళ్ల క్రితం నల్లజాతీయురాలిగా మారడం నాకు తెలియదు. ఆమె ఇప్పుడు నల్లజాతీయురాలిగా పిలువబడుతోంది. నేను రెండింటిని గౌరవిస్తాను. భారతీయ వారసత్వం కలిగిన కమలా హారిస్ అకాస్మత్తుగా నల్లజాతీయురాలిగా మారింది’’ అని ట్రంప్ కామెంట్స్ చేశారు.
కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ ఇండియా చెన్నైలో జన్మించారు. 19 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లారు. 2019లో తల్లి అస్థికల్ని చెన్నైలోని సముద్రంలో నిమర్జనం చేసేందుకు భారత్ వచ్చారు. మరోవైపు డెమెక్రాట్లు ట్రంప్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతూ, ఆమె భారతీయ-నల్లజాతీయ మహిళగా గుర్తించబడుతోందని వ్యాఖ్యానించింది.