Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్ చేశారు. టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు ‘‘అరబ్-ఇస్లామిక్ సైనిక కూటమి’’ని ప్రతిపాదించాయి. ఇది అమెరికన్ నాటో తరహాలో పనిచేయాలని నేతలు కోరారు.
అయితే, పెద్ద పెద్ద మాటలైతే చెప్పారు కానీ ఇజ్రాయిల్‌పై ఏ ఒక్క దేశం కూడా ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోలేదు. ఇది అనేక ముస్లిం దేశాల్లో నిరాశను రేకెత్తించింది. చివరకు కొన్ని చిన్నపాటి చర్యలు మాత్రమే తీసుకున్నారు. ఇజ్రాయిల్‌పై అందరూ చర్యలు తీసుకోవాలనే ప్రతిస్పందన వచ్చింది, చివరకు ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ తన చర్యల్ని కొనసాగించకుండా నిరోధించడానికి అన్ని చట్టపరమైన , ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలి’’ అని అన్ని దేశాలు పిలుపునిచ్చాయి.
Read Also: Wolf Attacks: యూపీలో మళ్లీ మొదలైన తోడేళ్ల దాడి.. ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు…
అయితే, ఇజ్రాయిల్‌పై ఎలాంటి ఆంక్షలు కానీ, చమురు ఆంక్షలు కానీ, దౌత్య సంబంధాలను తగ్గించుకునేందుకు ఏ దేశం కూడా ముందుకు రాలేదు. నిజానికి ‘‘అబ్రహం ఒప్పందం’’ చేసిన దేశాలు ఈ సమావేశంలో మౌనంగా ఉన్నాయి. యూఏఈ, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ముఖ్యమైన ప్రకటనలు చేయలేదు. గాజాపై ఇజ్రాయిల్ విజృంభిస్తున్న ఈ సమయంలో వీరంతా మౌనంగా ఉండటం గమనార్హం. సోమవారం బహ్రెయిన్, యూఏఈ అబ్రహం ఒప్పందంపై సంతకాలు చేసిన 5 ఏళ్లు పూర్తయయ్యాయి. దీని ద్వారా ఇజ్రాయిల్‌ను వారు అధికారంగా గుర్తించారు.
అనూహ్యంగా సౌదీ అరేబియా కూడా ఈ వివాదంతో అంటీముట్టనట్లు ఉంది. నిజానికి ఖతార్‌కు సౌదీకి ముందు నుంచే పడదు. అయినా కూడా ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో సమావేశానికి హాజరైన సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)ఈ సమావేశాన్ని ఉద్దేశించి కనీసం ప్రసంగించలేదు. స్పీకర్ జాబితాలో ఎంబీఎస్ లేకపోవడం సౌదీ అరేబియా జాగ్రత్తకు సంకేతమని, అనవసరంగా మాట్లాడి భౌగోళిక రాజకీయ చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు అని భావించవచ్చు.