Wolf Attacks: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరసగా తోడేళ్ల దాడులు వణికించాయి. ముఖ్యంగా బ్రహ్రైచ్ జిల్లాలో పలు గ్రామాల్లో మనుషులే టార్గెట్‌గా దాడులు చేశాయి. వీటిని పట్టుకునేందుకు యోగి సర్కార్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వందలాది అధికారుల్ని, బలగాలను మోహరించారు. అయితే, మరోసారి తోడేళ్ల దాడులు బహ్రైచ్‌ని భయపెడుతున్నాయి. తాజాగా, తోడేళ్ల దాడుల్లో ఇద్దరు మరణించగా, 9 మంది గాయపడ్డారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గత 20 రోజుల్లో మొత్తం 11 దాడులు జరిగాయని అధికారులు గురువారం తెలిపారు.
Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
తోడేళ్లను ట్రాక్ చేసేందుకు, పట్టుకునేందుకు పోలీస్, అటవీ అధికారులను, ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించారు. వీటిని బంధించేందుకు మొత్తం 100 మంది సిబ్బందిని నియమించారు. ఒక కంట్రోల్ రూం ఏర్పాటే చేయడంతో పాటు, సిబ్బందికి థర్మల్ డ్రోన్‌లు, నైట్ విజన్ కెమెరాలు, కెమెరా ట్రాప్‌లను అందించారు. గ్రామస్తులు తమను తాము రక్షించుకునేందుకు కర్రలతో పెట్రోలింగ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 09న జ్యోతి అనే నాలుగేళ్ల బాలికను ఒక తోడేలు ఈడ్చుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం పాప చనిపోయి కనిపించింది. సెప్టెంబర్ 11న మూడు నెలల బాలిక సంధ్యను ఆమె తల్లి ఒడి నుంచి తోడేలు లాక్కెళ్లింది. ప్రాణాంతక గాయాలతో పసిబిడ్డ చనిపోయింది. అటవీ శాఖ డ్రోన్ల ద్వారా రెండు తోడేళ్లను ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా చిక్కలేదు.
గతేడాది ఇలాగే తోడేళ్ల గుంపు ఈ ప్రాంతంలో 9 మందిని చంపేసింది, చాలా మందిని గాయపరిచాయి. ప్రభుత్వం వీటిని పట్టుకునేందుకు ‘‘ఆపరేషన్ వోల్ఫ్’’ ప్రారంభించింది.