College Students Sentenced To Death By Myanmar Junta: మయన్మార్ లో ప్రజాపాలనను గద్దె దించి అక్కడ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని అక్కడి జుంటా ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. ఉద్యమంలో పాల్గొన్న వారిని కాల్చేస్తూ చాలా మందిని చంపేశారు. ఇదిలా ఉంటే సైనికపాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అనేక ఆరోపణలతో వరసగా ఉరి తీస్తోంది సైనిక ప్రభుత్వం. ఇప్పటి వరకు 139 మందిని మరణశిక్ష పేరుతో చంపేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం ఏడుగురికి ఉరిశిక్ష విధించింది. ఏడుగురు యూనివర్సిటీ విద్యార్థులను బుధవారం తలుపులు మూసేసి ఉరితీసినట్లు యూఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ మరణశిక్షలపై అక్కడి జుంటా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. నిరసనలను అణచివేసేందుకు మరణశిక్షలను మయన్మార్ సాధనంగా ఉపయోగిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది.
Read Also: Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్‌కు మంచి అవకాశం
ఆగ్నేయాసియా దేశం అయిన మయన్మార్ లో ఫిబ్రవరి 2021లో ఆంగ్ సాన్ సూకీ పౌరప్రభుత్వాన్ని కూల్చేసి సైనికపాలన తీసుకువచ్చారు. సూకీతో పాటు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు. తాజాగా జరిగిన విద్యార్థుల ఉరిశిక్షలపై యూఎన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. యాంగోన్ విశ్వవిద్యాలయ విద్యార్థులను బ్యాంకు కాల్పుల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. తాజాగా వీరిని ఉరి తీశారు. విద్యార్థులపై మరణశిక్ష అమలు చేయడం మిలిటరీ ప్రతీకారం తీర్చుకునే చర్యగా అక్కడి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. మరో నలుగురు యువ కార్యకర్తలకు కూడా గురువారం అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది.
ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 2280 మంది పౌరులు మరణించారు. అసమ్మతిని తొలగించే పేరుతో సైనిక ప్రభుత్వం 11,637 మంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిరసనలను అణచివేసేందుకు 30 ఏళ్ల తరువాత మరణశిక్షలను ప్రయోగిస్తోంది.