China-Taiwan Issue: అమెరికా చట్ట సభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఆసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ముఖ్యంగా చైనా, తైవాన్ దేశాలు యుద్ధం చేస్తాయా అన్న రీతిలో సమాయత్తం అవుతున్నాయి. నాన్సీ పెలోసీ పర్యటన ద్వారా అమెరికా నిప్పుతో చెలగాలం ఆడుతోందని చైనా వార్నింగ్ ఇచ్చింది. అయినా నాన్సీ పెలోసీ, అమెరికా తగ్గకుండా.. తైవాన్ ద్వీపంలో పర్యటించారు. దీనికి తగ్గట్లుగానే తైవాన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు నాన్సీ పెలోసీని సాదరంగా ఆహ్వానించారు. ఇది చైనాకు మింగుడు పడటం లేదు. దీంతో తైవాన్ చుట్టూ సముద్ర తీరంలో భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్లు తైవాన్ రక్షణ గగన తలంలోకి చైనా ఆర్మీకి చెందిన యుద్ద విమానాలు జేఎఫ్ 11, జేఎఫ్ 17, ఎస్ యూ-30 విమానాలు ప్రవేశించాయి.
ఇదిలా ఉంటే నాన్సీ పెలోసీ పర్యటనను అవమానంగా భావిస్తున్న చైనా తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ నాన్సీ పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పెలోసీపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పెలోసీ తన పర్యటనతో చైనా సార్వభౌమాధికారాన్ని, వన్ చైనా విధానాన్ని అతిక్రమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది డ్రాగన్ కంట్రీ. పెలోసీతో పాటు ఆమె కుటుంబంపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. గతంలో అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై కూడా చైనా ఆంక్షలను విధించింది.
Read Also: Ban On Women In Advertisements: మహిళలు అక్కడ నటించడం కుదరదు.. ఆ దేశంలో కీలక నిర్ణయం
వన్ చైనా విధానంలో తైవాన్ కూడా ఓ భాగం అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది. తైవాన్ ను ఏదో రోజు స్వాధీనం చేసుకుంటామని.. బహిరంగంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే చైనాకు పెలోసీ కూడా దిబ్బతిరిగే కౌంటర్లు ఇస్తోంది. అమెరికా అధికారులు తైవాన్ వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు. తైవాన్ ను ఒంటరి చేయాలని.. డ్రాగన్ దేశం ప్రయత్నిస్తోందని.. తైవాన్ యథాతథ స్థితిని మార్చాలనే ఉద్దేశం తనకు లేదని.. అయితే అక్కడ శాంతియుత పరిస్థితులు తలెత్తాలన్నదే మా ప్రయత్నం అని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో ఉన్న పెలోసీ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై చైనా ఆంక్షలు విధించింది.