China Covid surge, 1 million cases daily: ప్రపంచ ఇప్పటి వరకు చూడని ఉత్పాతాన్ని చైనా ఎదుర్కోబోతోంది. కోవిడ్ వల్ల ఆ దేశం ఉక్కిరిబిక్కిరి కాబోతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ రాకెట్ వేగంతో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో అక్కడి ప్రజల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదు అవుతున్నాయిన.. లండన్‌కు చెందిన అనలిటిక్స్ సంస్థ చేసిన కొత్త పరిశోధనను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ గురువారం నివేదించింది.
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి చెందుతోంది. అత్యధిక వ్యాప్తి, తక్కువ ఇంక్యుబేషన్ పిరియడ్ ఉన్న ఈ వేరియంట్ వల్ల చైనీయులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇన్నాళ్లు ‘‘జీరో కోవిడ్’’ విధానాన్ని అనుసరించిన చైనా, అక్కడి ప్రజల నిరసనలతో దీన్ని ఎత్తేసింది. దీంతో అక్కడ లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు నెలల్లో 60 శాతం మంది జనాభాకు కరోనా సోకుతుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెల నాటికి రోజూవారీ కేసుల సంఖ్య 3.7 మిలియన్లకు, మార్చి నాటికి 4.2 మిలియన్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Read Also: Minister RK Roja: వ్యాక్సిన్ కనిపెట్టారు సరే.. కొడుకును కూడా గెలిపించుకోలేరా?
వచ్చే మూడు నెలల్లో చైనాలో మూడు కరోనా వేవ్ లు విధ్వంసం సృష్టస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. జనవరి మధ్య వరకు మొదటి వేవ్, ఆ తరువాత సెకండ్ వేవ్, ఫిబ్రవరి- మార్చి మధ్య థర్డ్ వేవ్ చైనాను అటాక్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే చైనా మాత్రం గత 24 గంటల్లో కొత్తగా 3 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయని.. ఎవరూ చనిపోలేదని చెబుతోంది. కరోనా విషయంలో చైనా నిజమైన సంఖ్యను వెల్లడించడం లేదని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది.
అయితే గతంలో అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి సమయంలో ఆ దేశంలో రోజుకు 10 లక్షల కేసులు నమోదు అయ్యాయని.. ప్రపంచ వ్యాప్తంగా కేసులు రోజుకు 40 లక్షలు దాటడాన్ని చూశామని పరిశోధకులు ప్రస్తావించారు.ఇదిలా ఉంటే జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో మాస్ టెస్టింగ్ కేంద్రాలను ప్రభుత్వం మూసేసింది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. దీంతో చివరకు అంత్యక్రియలు చేసేవారు కూడా దొరకడం లేదు. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. మరోవైపు ఫార్మాసీల్లో మందులు అడుగంటుకుపోయాయి. దీంతో చైనా ప్రజలు సాంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడి నిమ్మకాయలకు భారీ డిమాండ్ ఏర్పడింది.