భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపికైంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. దీన్ని 2009లో ప్రారంభించారు. భారతీయ స్నాక్స్‌ను ఈ రెస్టారెంట్ అందుబాటు ధరల్లోనే అందించడం ప్రత్యేకత. చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.. అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా చాయ్ పానీని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్‌కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి నెట్టి మరీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
చికాగోలోని జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను చాయ్‌పానీని ఎంపిక చేసింది. ఇక్కడ దొరికే ‘చాట్’ చాలా ఫేమస్. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయని చెబుతుంటారు.ఈ రెస్టారెంట్ లో క్రంచీ చాట్ 8.49 డాలర్ల నుంచి లభిస్తుంది. థాలీ వంటకాలు 16.99 డాలర్ల నుంచి అందుబాటులో ఉంటాయి. వడా పావ్, పావ్ బాజీ ఒక్కోటీ 10.99 డాలర్లు. చికెన్ టిక్కా రోల్ 11.99 డాలర్లు. కొవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది.