ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటా గూగుల్‌కి.
ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్‌టెల్‌తో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్‌టెల్ సెబీకి తెలిపింది.
ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి
క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో మొత్తం విలువ 123.81 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. డిపాజిట్లు 9.77 శాతం పెరగటంతో మొత్తం విలువ 169.61 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది.
52 వారాల కనిష్టానికి ఐటీ షేర్లు
ఐటీ షేర్లు నిన్న కూడా నేల చూపులు చేశాయి. నిఫ్టీలో 52 వారాల కనిష్టం కన్నా దిగువకు పడిపోయాయి. ఇంట్రా-డేలో 26,399.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేసుకున్నారు. నిఫ్టీలో ఐటీ షేర్లు ఇంత తక్కువకి ట్రేడ్ అవటం గతేడాది మే నెల తర్వాత ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోనూ ఐటీ షేర్ల వ్యాల్యూ 1.44 శాతం డౌన్ అయింది.
0.4 శాతానికి తగ్గిన చైనా ఆర్థిక వృద్ధి
చైనా ఆర్థిక వృద్ధి గతేడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి 0.4 శాతానికి తగ్గింది. కరోనా లాక్‌డౌన్ల వల్ల షాంఘై పోర్టులో ఎగుమతులు పడిపోయాయి. షాంఘై పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ అనే సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ల కారణంగా షాంఘైతోపాటు దేశంలోని పెద్ద నగరాల్లో కూడా తయారీ రంగం డీలా పడిపోయింది.
ఇండియాలోకి భారీగా పెట్టుబడులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), అమెరికా మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. యూఏఈ దాదాపు 15,500 కోట్ల రూపాయలు, అమెరికా సుమారు 2,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కుల డెవలప్‌మెంట్ కోసం యూఏఈ ఇన్వెస్ట్ చేస్తుండగా గుజరాత్‌లోని ద్వారకాలో రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అమెరికా పెట్టుబడి పెట్టనుంది. ఐ2 అంటే.. ఇండియా, ఇజ్రాయెల్. యు2 అంటే యూఏఈ, యూఎస్.
రికార్డు స్థాయికి వాణిజ్య లోటు.
జూన్ నెలలో అంచనాను మించి వాణిజ్య లోటు నెలకొంది. రికార్డ్ స్టాయిలో 26.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్, బంగారం, బొగ్గు దిగుమతులూ అదే స్థాయిలో పెరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. దిగుమతులు 57.55 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లకు చేరాయి.