Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల మధ్య తొలిసారిగా షేక్ హసీనా ప్రత్యర్థి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా తొలి సందేశాన్ని ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ జైలులో ఉన్న ఖలిదా జియాను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమె విడుదలైన తర్వాత తొలిసారిగా మాట్లాడింది. అనారోగ్యంతో ఆస్పత్రి బెడ్‌పై ఉండే ఆమె తన సందేశాన్ని ఇచ్చారు.
Read Also: Priya Bhavani Shankar: ఇండియన్ 2 ట్రోల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్
‘‘ అన్ని మతాలను గౌరవించే ప్రజాస్వామ్య బంగ్లాదేశ్’’ని నిర్మించాలని దేశ ప్రజల్ని ఆమె కోరారు. ‘‘మీరు ఇంతకాలం నా ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అల్లా ఆశీర్వాదం కారణంగా నేను మీతో మాట్లాడగలిగాను. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం నుంచి మేము స్వాతంత్య్రం పొందాము. ప్రాణాలర్పించిన ధైర్యవంతులకు నా ప్రణామాలు’’ అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు. మన ధైర్యవంతులైన పిల్లలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు, దేశాన్ని విముక్తి చేశారని అన్నారు. ఈ విజయం తమని కొత్త ఆరంభంలోకి తీసుకువచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, అవినీతి నుంచి బయటపడిన కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థులు యువతే తమ భవిష్యత్తు అని, వాళ్ల కలలకు ప్రాణం పోయాలని ఆమె సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.
“అన్ని మతాలను గౌరవించే ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ను మనం నిర్మించాలి. యువత మరియు విద్యార్థులు దీనిని సాధిస్తారు. శాంతి మరియు శ్రేయస్సు ఉన్న ప్రగతిశీల బంగ్లాదేశ్. ప్రతీకారం మరియు ద్వేషం లేని దేశం” అని ఆమె అన్నారు. షేక్ హసీనా పాలనలో 2018లో అక్రమాల కేసులో 79 ఏళ్ల ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలడంతో, ప్రెసిడెంట్ ఆదేశాలతో ఖలిదా జియా మంగళవార జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వంలో ఈమె పార్టీ బీఎన్‌పీ కూడా భాగస్వామ్యం కాబోతోంది.