Joe Biden: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా నిలబడిన డెమొక్రాట్ అభ్యర్థి, ఉపఅధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. నిజానికి ముందుగా ట్రంప్‌కి పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని అనుకున్నప్పటికీ, డెమొక్రటిక్ పార్టీ పట్టుబట్టీ మరి కమలా హారిస్‌కి అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చింది.
Read Also: Fake IPS: నకిలీ ఐపీఎస్ బాగోతం బయటపెట్టిన కుటుంబ సభ్యులు..
అయితే, ట్రంప్ గెలవడంపై ఇప్పటికీ బైడెన్ చింతిస్తున్నట్లు సమాచారం. తాను పోటీ చేసి ఉంటే ట్రంప్‌ని ఓడించగలిగే వాడినని భావిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడం పట్ల ఇంకా బాధగానే ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. అధ్యక్ష డిబెట్స్‌లో ట్రంప్‌కి బైడెన్ పోటీ ఇవ్వడం లేదని, తక్కువ అప్రూవల్ రేటింగ్ ఉన్న కారణంగా కమలా హారిస్‌ని అధ్యక్ష రేసులోకి దించారు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. తన ప్రచారంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, ట్రంప్‌ని ఓడించగలనని బైడెన్ ఇప్పటికీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న డిబేట్ తర్వాత, బైడెన్ జూలై 21న తన ప్రచారాన్ని ముగించారు. అతను వైదొలిగి కమలా హారిస్‌ని పోటీలో దించాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. కమలా హారిస్‌కి కేవలం చివరి 3 నెలల సమయం మాత్రమే దక్కింది. కమలా హారిస్ చివరకు 2.2 మిలియన్ ఓట్ల తేడాతో పాపులర్ ఓట్లు కోల్పోవడంతో పాటు స్వింగ్ స్టేట్స్‌గా భావించి కీలక రాష్ట్రాల్లో కూడా తుడిచిపెట్టుకుపోయారు. అయితే, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి హారిస్‌ని బాధ్యురాలిని చేయడానికి బైడెన్ నిరాకరించారు. ఇదిలా ఉంటే, కమలా హారిస్ మద్దతుదారులు మాత్రం బైడెన్ తాను రేసు నుంచి వైదొలిగేందుకు తాత్సారం చేశారని మండిపడుతున్నారు.