Benjamin Netanyahu as Prime Minister of Israel.. Exit polls revealed: ఇజ్రాయిల్ దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఆ దేశ పార్లమెంట్ కనాసెట్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి భారతదేశానికి మిత్రుడిగా, ప్రధాన మంత్రితో మంచి స్నేహం ఉన్న బెంజిమిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వస్తారని తెలుస్తోంది. అక్కడి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మంగళవారం ఎన్నిలక తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కనాసెట్ లోని 120 స్థానాలకు గానూ నెతన్యాహు లికుడ్ పార్టీ 61-62 సీట్లతో స్వల్ప మెజారిటీ సాధిస్తుందని వెల్లడించాయి.
రైటిస్ట్ భావజాలం ఉన్న బెంజిమెన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, లెఫ్టిస్ట్ పార్టీలపై ఆధిక్యత సంపాదించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇజ్రాయిల్ దేశానికి సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన నెతన్యాహూ మాట్లాడుతూ.. మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారం చివరిలోగా తుది ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2015తో పోలిస్తే ఈ సారి పోలింగ్ ఎక్కువ నమోదు అయింది.
Read Also: T20 World Cup: పాకిస్థాన్‌ను ఓడించిన జింబాబ్వేకు నెదర్లాండ్స్ బిగ్ పంచ్
వరసగా 12 ఏళ్ల పాటు ఇజ్రాయిల్ ను ఏలిన నెతన్యాహు పాలన 2021లో ముగిసింది. యాయిర్ లాపిడ్, నఫ్తాలీ బెన్నెట్, అరబ్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రిగా యాయిర్ లాపిడ్ మితవాదం కారణంగా భద్రత, పెరుగుతున్న ధరలు ఓటర్లలో ఆందోళననింపాయి. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం లాపిడ్ పార్టీ 54-55 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది.
జాతీయవాద భావాలు ఉన్న బెంజిమిన్ నెతన్యాహూ అధికారంలోకి వస్తే భారత్ తో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా.. నెతన్యాహూ అండగా నిలిచారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీతో నెతన్యాహూకు మంచి స్నేహం ఉంది. పలుమార్లు నెతన్యాహూ, మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ వ్యాఖ్యానించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో కూడా ఇజ్రాయిల్ వినూత్నంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పింది. 2017లో నరేంద్రమోదీ ఇజ్రాయిల్ పర్యటన నేపథ్యంలో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని జెంజిమిన్ నెతన్యాహూ మోదీకి సాధారంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఇండియా-ఇజ్రాయిల్ బంధాన్ని బలోపేతం చేసేలా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.