BBC Documentary on Modi: 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు సీరీస్ లను బీబీసీ రూపొందించింది. అయితే ఈ డ్యాక్యుమెంటరీపై భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం బీబీసీ చర్యలను ఖండించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ ఎంపీ ప్రధాని మోదీపై చర్చను లేవనెత్తాడు. అయితే ప్రధాని రిషి సునాక్, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
Read Also: Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో
ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ లార్డ్స్ తో సభ్యుడిగా ఉన్న రామి రేంజర్, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని తప్పుపట్టాడు. భారత దేశం జీ-20కి అధ్యక్షత వహిస్తున్న వేళ, యూకేలో భారత సంతతి ప్రధాని ఉన్న సమయంలో, భారత్-యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవికి దీనిపై లేఖ రాశారు. యూకే నగరాల్లో హిందువుల, ముస్లిం మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి..దీన్ని పెంచే విధంగా డాక్యుమెంటరీలోని రెండో భాగం ఉందని, దాన్ని నిలిపివేయాలని బీబీసీని కోరాడు.
ఈ డాక్యుమెంటరీ చాలా దుర్మార్గంగా ఉందని విమర్శించారు. బీబీసీలో పాకిస్తాన్ మూలాలకు చెందిన సిబ్బంది ఈ అర్థం లేని పనివెనక ఉన్నారా..? అని రామి రేంజర్ ప్రశ్నించారు. ఈ డాక్యుమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాన మంత్రిని, భారతదేశ న్యాయవ్యవస్థను అవమానపరిచిందని అన్నారు. ఈ డాక్యుమెంటరీని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని.. హింస, ప్రాణనష్టం ఎక్కడ జరిగినా.. ఖండిస్తున్నానని.. భారతదేశంలోని రాజకీయాలను ప్రపంచానికి తీసుకురావడం ద్వారా యూకేలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను హింసించే దేశంగా భారత్ ను చిత్రీకరించడానికి, పాత గాయాలను తెరిచిందని అన్నారు. ఇదే నిజం అయితే ముస్లింలు ఈ పాటికి భారతదేశాన్ని వదిలివెళ్లేవారని, కానీ భారత్ ముస్లిం జనాభా పాకిస్తాన్ కన్నా ఎక్కువ అని గుర్తిచేశారు.