Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్‌ని బంగ్లా ప్రజల హృదయం నుంచి తుడిచేయాలని మహ్మద్ యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే, షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ పార్టీని రద్దు చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్ జాతిపిత ఖ్యాతిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also: Operation Sindoor: పాక్ ప్రయోగించిన “టర్కీ బైరక్తర్ డ్రోన్ వలయాన్ని” భారత్ ఎలా ఛేదించింది..?
1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి కారణమైన ముజిబుర్ రెహమాన్‌ని 1975లో సైనిక తిరుగుబాటులో హత్య చేశారు. మొత్తం కుటుంబాన్ని హతమార్చారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి వేరే దేశంలో ఉండటంతో బతికిపోయారు. అప్పటి నుంచి ఆయన చిత్రపటం బంగ్లా కరెన్సీ అయిన టాకా నోట్లపై ఉండేది.
“కొత్త సిరీస్ మరియు డిజైన్ ప్రకారం, నోట్స్‌లో ఎటువంటి మానవ చిత్రాలు ఉండవు, బదులుగా సహజ ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయాన్ని సూచించే వాటిని ప్రదర్శిస్తాయి” అని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ ఖాన్ చెబుతున్నారు. కొత్త నోట్లపై హిందూ, బుద్దిస్ట్ ఆలయాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఆదివారం మూడు నోట్లు విడుదల చేశారు. కొత్త నోట్లు కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కార్యాలయాలకు జారీ చేస్తామని అధికారులు చెప్పారు.