Push-Ups World Record: సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు. అది కూడా కేవలం ఒక గంట సమయంలోనే. ఈ ఫీట్ తో అతను ఇంతకుముందు ఉన్న పుష్-అప్స్ రికార్డ్ బద్దలు కొట్టాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఆస్త్రేలియా బ్రిస్బేన్ కు చెందిన లూకాస్ హెల్మేకే (33) అనే వ్యక్తి ఒక గంటలో 3,206 పుష్-అప్‌లను చేశాడు. అంటే సగటున నిమిషానికి 53 కంటే ఎక్కువ. గతంలో 3,182 రికార్డును ఏప్రిల్ 2022లో మరో ఆస్ట్రేలియన్ డేనియల్ స్కాలీ నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టాడు లూకాస్.
Read Also: Dog Attack: వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కొరికిన పిట్‌బుల్.. విషమంగా బాధితుడి ఆరోగ్యం..
లూకాస్ ఈ ఫీట్ సాధించడానికి రెండు మూడేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాడు. దీని కోసం అతను 30 సెకన్ల టైమ్ ని విభజించుకుని పుష్-అప్స్ చేయడం ప్రారంభించాడు. ప్రతీ 30 సెకన్ల సెట్ లో 26 పుష్ అప్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీన్ని అతడు అధిగమించి ఆ సమయంలో సగటున 26.7 పుష్ అప్స్ సాధించాడు. ఈ ఫీట్ చేసే సమయంలో శరీరం నిటారుగా ఉండాలి. నడుము వంగకూడదు. మోచేయి వద్ద కనీసం 90 డిగ్రీల కోణం పొందే వరకు శరీరాన్ని తప్పనిసరిగా కిందికి తీసుకురావాలి. దీని తర్వాత చేతులు నిటారుగా పైకి లేవాలి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా అది కౌంట్ కాదు. ప్రస్తుతం గిన్నిస్ రికార్డ్ సాధించిన లూకాస్ ప్రతీ ఏడాది ఇలాగే ఓ రికార్డ్ నెలకొల్పాలని భావిస్తున్నాడు.