Dog Attack: దేశంలో కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. రోజుకు ఎక్కడో చోట దీనికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కొరికింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాల్ లోని బిజ్నా గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న కరణ్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై పిట్ బుల్ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
కరణ్ ప్రైవేట్ భాగాన్ని కరిచింది. ఈ దాడి నుంచి రక్షించుకునేందుకు, కుక్కను వదిలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కుక్క నోటిలో గుడ్డ పెట్టే వరకు అతడిని అది వదిలిపెట్టలేదు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చుట్టుపక్కల వారు ఘరౌండాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నాల్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దాడి తర్వాత గ్రామస్తులు అంతా కలిసి కుక్కను కొట్టి చంపారు.
Read Also: Covid-19: భారీగా కరోనా కేసులు.. 50 వేలకు చేరిన యాక్టివ్ కేసులు..
గ్రామంలో గతవారం నుంచి ఈ పిట్ బుల్ కుక్క సంచరిస్తోందని, రెండు రోజుల క్రితం కూడా ఓ వ్యక్తిపై దాడి చేసిందని బాధితుడి బంధువులు తెలిపారు. కుక్కల బెడద వల్ల బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని వాపోయారు. పోలీసుకు ఈ దాడిపై ఫిర్యాదు చేయగా, గాయపడిన యువకుడు, అతని కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
ఇదే తరహాలో అక్టోబరు 14, 2022న హర్యానాలోని రేవారీలోని బలియార్ ఖుర్ద్ గ్రామంలో ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు పిల్లలపై పిట్‌బుల్ కుక్క దాడి చేసింది. ఆసుపత్రిలో చేరిన మహిళ కాలు, చేతి మరియు తలపై 50 కుట్లు పడ్డాయి. గ్రామ మాజీ సర్పంచ్ సూరజ్ తన భార్యతో కలిసి ఇంటికి చేరుకోగానే తమ పెంపుడు కుక్క తనపై దాడి చేసిందని తెలిపారు. వారిద్దరి పిల్లలపై కూడా ఈ కుక్క దాడి చేసింది. పిట్‌బుల్ కుక్కలు వాటి దూకుడుగా ప్రవర్తిస్తుంటాయి. వాటి దాడులు తీవ్రమైన గాయాలు లేదా మరణాలకు కూడా కారణమవుతాయి. అనేక సందర్భాల్లో, బాధితులు పిల్లలు లేదా సీనియర్ సిటిజన్లు, వారు కుక్కల దాడికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోలేరు.