భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్‌లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడమే శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. మే 3వ తేదీ నుంచి తమ ఆదేశాలను కాదని స్వదేశంలో అడుగుపెడితే.. జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం అంత ఆశామాషీగా తీసుకోలేదని.. ఆస్ట్రేలియన్ల ఆరోగ్యం మాకు ముఖ్యమని.. క్వారంటైన్‌లోని కరోనా కేసుల సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది ఆస్ట్రేలియా.. అయితే, ఈ ఆంక్షలపై మే 15వ తేదీ తర్వాత సమీక్షిస్తాని చెబుతోంది. కాగా, ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిని జాతి వివక్షగా ఇండియన్-ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లు చెబుతున్నారు.. యూఎస్, యూకే, యూరప్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నా.. వారిపై లేని ఆంక్షలు తమపై ఎందుకని నిలదీస్తున్నారు. భారతీయను టార్గెట్ చేయడం దారుణమని మండిపడుతున్నారు.