Migrants missing after boat sinks off Tunisia: మంచి జీవితం కోసం యూరప్ వలస వెళ్తాం అనుకున్న వలసదారుల ఆశలు అవిరయ్యాయి. మధ్యదరా సముద్రంల ట్యూనీషియా తీరంలో పడవ మునిగిపోవడంతో 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో ట్యూనీషియా తీరంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
దాదాపుగా 23 మంది ఆఫ్రికన్ వలసదారులు గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. శనివారం రెండు పడవలు ట్యునీషియా నుంచి మధ్యధరా సముద్రం దాటి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మునిగిపోవడంతో నలుగురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గల్లంతైనవారి గురించి వేట సాగిస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. కోస్ట్ గార్డు మరో 53 మందిని రక్షించినట్లు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Read Also: Dog attacks: సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్ వెల్లడి
ఇటీవల కాలంలో ట్యునీషియా తీరంలో పడవ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ఆఫ్రికా నుంచి దొంగచాటున బతుకుదెరువు కోసం ఇటలీతో పాటు ఇతర యూరప్ దేశాలకు వలస వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు, నిత్యం సంఘర్షణల కారణంగా ప్రజలు ట్యునీషియా, లిబియా నుంచి యూరప్ వెళ్తున్నారు. సబ్ సహారా ఆఫ్రికా దేశాల నుంచి 14,000 మందికి పైగా వలసదారులు ఈ ఏడాది మూడు నెలల్లో యూరప్ వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో దొరకడమో లేదా రక్షించబడటమో జరిగింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో పోలిస్తే 5 రెట్లు అధికం.
ట్యునీషియా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోకపోతే, ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ దేశాలకు వలసదారులు పెద్ద ఎత్తున వచ్చే ప్రమాదం ఉందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. పతనం అంచున ఉన్న ట్యునీషియాకు సహాయం చేయడానికి ఐఎంఎఫ్ ఇతర దేశాలకు పిలునిచ్చింది.