Turkey-Syria Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో వచ్చిన భూకంపం ఆ దేశాలను మరుభూమిగా మార్చాయి. ఎక్కడ చూసిన ప్రజల ఏడుపులు, కూలిన కట్టడాలే దర్శనం ఇస్తున్నాయి. సోమవారం వచ్చిన వరస భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీ, సిరియాలను అతలాకుతలం చేశాయి. ఇప్పటికే భూకంపం వల్ల మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 5102 మంది మరణించారు, ఒక్క టర్కీలోనే 6000 భవనాలు కూలిపోయాయి. శిథిలాలు వెలికితీసే కొద్ది మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి 8 రెట్లు మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.
Read Also: TSRTC : భక్తులకు శుభవార్త.. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
ఇదిలా ఉంటే ఈ భూకంపం వల్ల ఇరు దేశాల్లో 2.30 కోట్ల మంది ప్రజలు ప్రభావితం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గత 12 ఏళ్లుగా సుదీర్ఘమైన సంక్షోభంలో ఉన్న సిరియాకు అత్యధికంగా మానవతా సాయం కావాలని వెల్లడించింది. 1.4 మిలియన్ పిల్లలతో పాటు 23 మిలియన్ల మంది ప్రజలపై భూకంప ప్రభావం ఉంటుందని వెల్లడించింది. దక్షిణ టర్కీలో వేలాది మంది మరణించారని తెలిపింది. మంగళవారం రోజు కూడా టర్కీలో 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. రెండు రోజుల వ్యవధిలో 100కు పైగా ప్రకంపనలు వచ్చాయి.
ఈ విషాదంతో టర్కీ 7 రోజలు పాటు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించింది. 24,400 మంది రెస్క్యూ సిబ్బందిని సహాయచర్యల్లో దించినట్లు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటు ప్రపంచదేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. భారత్ మెడిసిన్స్, ఇతర సహాయసిబ్బందిని పంపింది.