Turkey Earthquake: టర్కీ దేశం భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతింది. టర్కీలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియా కూడా దెబ్బతింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్య 24 వేలను దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టపోయిన టర్కీకి ప్రపంచదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో రెస్క్యూ ఆపరేషన్, వైద్య సహాయం అందిస్తోంది. ఇతర ప్రపంచదేశాలు కూడా తగినంత సహాయం చేస్తున్నాయి.
Read Also: Pakistan: దైవదూషణ పేరుతో హత్య.. పోలీసుల ముందే ఘటన..
ఇదిలా ఉంటే ఆర్మేనియా, టర్కీకి సహాయాన్ని పంపింది. ఇది ఎందుకంత ప్రత్యేకం అంటే పాకిస్తాన్, భారత్ లాగే ఈ రెండు దేశాలు కూడా బద్ధ శత్రువులు. టర్కీ, ఆర్మేనియాల శతృత్వం అంతకన్నా ఎక్కువనే చెప్పాలి. గత 35 ఏళ్లుగా ఈ రెండు దేశాల సరిహద్దులు మూసే ఉన్నాయి. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇరు దేశాల మధ్య సరిహద్దు మళ్లీ ప్రారంభం అయింది. ఆహారంతో కూడిన ఐదు ట్రక్కులు ఆర్మేనియా నుంచి టర్కీకి చేరుకున్నాయి. 1988 తర్వాత ఇప్పుడే తొలిసారిగా సరిహద్దులను తెరిచారు. ఆహారంతో పాటు మెడిసిన్స్ ను ఆర్మేనియా, టర్కీకి పంపింది. సాయం చేసినందుకు టర్కీ ప్రత్యేక రాయబారి సెర్దార్ కిలిక్, ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రూబెన్ రూబినియన్ కు ట్వీట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం కాలంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్మేనియన్లను సామూహికంగా హత్యలు చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 డిసెంబర్ లో నగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆర్మేనియాకు వ్యతిరేకంగా అజర్ బైజాన్ కు టర్కీ మద్దతు ఇచ్చింది, అత్యాధుని ఆయుధాలు ఇవ్వడం ద్వారా అజర్ బైజాన్, ఆర్మేనియాపై గెలిచింది. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనేందుకు ప్రత్యేక రాయబారులను నియమించుకున్నాయి. రెండేళ్ల తరువాత టర్కీ, ఆర్మేనియా 2022 ఫిబ్రవరిలో తొలి వాణిజ్య విమానాల సర్వీసులను తిరిగి ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు వివాదం వల్ల 1993 నుంచి భూ సరిహద్దు మూసివేశారు.