Anti-Hijab Protest Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనుందుకు ఇరాన్న మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె మరణించింది. మహ్సా అమిని మరణం యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వం కూడా నిరసనలను ఉక్కుపాదంతో అణచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడి ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. ఇరాన్ నిరసనలను అణిచివేయాడానికి తమ పౌరులనే చంపుతోంది. ఇప్పటి వరకు ఆదేశంలో 92 మంది మరణించారని నార్వేకు చెందిన ఇరాన్ మానవహక్కుల సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 16న మహ్సా అమిని చనిపోతే.. అప్పటి నుంచి ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో తల ముడుస్తూ.. హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నానని ఓ యువతి పెట్టిన పోస్టు సోషల్ మీడయాలో వైరల్ అయింది. అయితే ఆ తరువాత ఇరాన్ భద్రతా బలగాలు ఆ యువతిని కాల్చి చంపాయి.
Read Also: Pope Francis: ఇంకెంత రక్తపాతం జరగాలి.. దయచేసి పుతిన్, జెలన్ స్కీలు యుద్ధాన్ని ఆపాలి
2019 ఇరాన్ లో మతాధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ తరువాత మహ్సా అమిని మరణంతో యాంటీ హిజాబ్ ఆందోళనలు ఇరాన్ లో జరుగుతున్నాయి. ఇరాన్ యువత, మహిళలకు మద్దతుగా వెస్ట్రన్ దేశాలు నిలుస్తున్నాయి. అయితే ఇదంతా వెస్ట్రన్ దేశాలు, అమెరికా తమ దేశంలో పెట్టిన కుట్రగా ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే మహ్సా అమిని తండ్రి మాత్రం తన కుమార్తె పోలీసులు కొట్టడం వల్లే చనిపోయిందని చెబుతున్నారు.. ఇరాన్ అధికారులు చెబుతున్నట్లు తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని.. కనీసం డెత్ రిపోర్టు చూపేందుకు అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.