US Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అమెరికా ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న 64 ఏళ్ల మైక్ పెన్స్.. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడి రేసు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Read also: Hombale: కాంతర హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ‘రాజ్ కుమార్’ వారసుడు
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున రంగంలోకి దిగాలని మైక్ పెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడైన సొంత పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టారు. 2021లో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్ భవనంపై చేసిన దాడిని పెన్స్ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఐయోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో రాజ్యాంగం కంటే తామే ఎక్కువ అని భావించే వారు ఎవరైనా.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వకూడదని.. ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎవరైతే తమను రాజ్యాంగం కన్నా ఎక్కువగా పరిగణించాలని చూస్తున్నారో అటువంటి వారిని మరోసారి శ్వేత సౌధ అధిపతిగా ఎంచుకోకూడదని సొంత పార్టీ నేతలకు.. అమెరికా ఓటర్లకు సూచించారు.
Read also: Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్.. ట్రంప్‌ను సమర్థించేవారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఆయనపై వచ్చిన వివాదాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చేవారు. అలాంటి మైక్ పెన్స్.. ఇప్పుడు ధైర్యంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాపిటల్ హిల్స్ భవనంపై దాడిని రాజకీయ విషపూరితమైన.. భయంకరమైన ఘటనగా పెన్స్ అభివర్ణించారు. అయితే పెన్స్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్‌పై వ్యతిరేకంగా ఉన్న వారిని తనవైపు ఆకర్షించేందుకు బాగా సహకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధ్యక్ష పదవి పోటీ కోసం ట్రంప్, పెన్స్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి మరొకొంత మంది ఎదురు చూస్తున్నారు. నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్నట్లు మంగళవారం ప్రకటించారు.