తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో సమావేశం అయ్యారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత భారత్ నుంచి ఇదే అధికారిక పర్యటన
భారత్ తో పాటు చైనా, కువైట్ దేశాలకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తాలిబన్లు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘన్ వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ గా తాలిబన్లు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కాబూల్, ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు ఆఫ్ఘన్ నుంచి వైద్యం కోసం చాలా మంది భారత్ కు వస్తుంటారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ద్రాక్ష, దానిమ్మ, నేరేడు, కుంకుమ, ఔషధ మొక్కల సీజన్ అని దీంతో సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులు పున: ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది తాలిబన్ ప్రభుత్వం.
2021, ఆగస్టు 15న అక్కడి ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం కనీస తిరుగుబాటు లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. విదేశాల నుంచి వచ్చే సాయం కూడా ఆగిపోయింది. దీంతో చేసేదేం లేక తాలిబన్లు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా ఆప్ఘనిస్తాన్ కు మానవతా సాయం అందిస్తోంది. గోధుమలు, మెడిసిన్స్ ను సరఫరా చేసింది. అక్కడి తాలిబన్ సర్కార్ కూడా తమ దేశంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులను తిరిగి ఇండియా ప్రారంభించాలని, దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తాలిబన్ ప్రభుత్వం ఉన్నతాధికారి ఇటీవల ఇండియాలో పర్యటించారు. ఇదే విధంగా భారత్ నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం తాలిబన్ లతో చర్చలు జరిపింది.