ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్య్లూ ఎఫ్ పీ) నివేదిక ప్రకారం ఆఫ్ఘన్ లోని సగం జనాభాకు తిండికి తిప్పలు ఏర్పడిందని తెలిపింది. సగం జనాభా ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. ఆఫ్ఘన్ లో 1.97 కోట్ల జనాభాకు ఆహారం దొరకడం లేదు. చేయడానికి పనిలేక… పస్తులు ఉండలేక అక్కడి ప్రజలు అవయవాలను కూడా అమ్ముకుంటున్నారు. కిడ్నీలను అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సొంత కూతుళ్లను, బిడ్డలను వేరే దారి లేక అమ్ముకుంటున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కు ప్రపంచ సాయం అందడం లేదు. ఆఫ్ఘన్ పౌర పాలనలో ఉన్నప్పుడు ఎక్కువగా విదేశాల నుంచి నిధులు వచ్చేవి… అయితే ఎప్పుడైతే తాలిబన్లు అధికారాన్ని చేపట్టారో అప్పటి నుంచి ఆ సాయం కూడా అందడం లేదు.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల కాలంలో తీవ్రవాద దాడులు కూడా ఎక్కువయ్యాయి. మైనారిటీలు అయిన వారిపై దాడులు జరుగుతున్నాయి. ఐఎస్ఎస్ కే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతోంది. షియాలు, హజారాల వంటి మైనారిటీలే లక్ష్యంగా మసీదుల్లో ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి.