ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబన్ల పాలనలోకి వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బదలాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. అధికార బదలాయింపు పూర్తికాకుండానే అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లే ఇందుకు కారణం. ఆఫ్ఘన్‌లో భద్రత ఏ స్థాయిలో ఉన్నదో నిన్నటి సంఘటనతో తేలిపోయింది. తాలిబన్లకు పాలన అప్పగిస్తే ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ నిషేదిత ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత యుద్దాలతో, అరాచకత్వంలో అతలాకుతలం అవుతున్న ఆఫ్ఘన్‌లో ఇప్పుడు మరో సంక్షోభం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం మొదలైనట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొన్నది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నివేదిక ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు ఆహరం లేక అలమటిస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది చిన్నపిల్లలు పోషకాహార లోపం ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.