థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఇక కంబోడియా జరిపిన దాడుల్లో చిన్నారి సహా తొమ్మిది మంది థాయ్‌లాండ్ పౌరులు మరణించారు. గురువారం ఉదయం 7:35 గంటలకు సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. థాయ్ సైన్యం ప్రకారం.. టా ముయెన్ ఆలయం సమీపంలోని వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా డ్రోన్‌ను గుర్తించిన తర్వాత ఘర్షణ మొదలైంది. దీంతో నమ్ పెన్‌లోని థాయ్‌లాండ్ రాయబార కార్యాలయం తన పౌరులను కంబోడియా విడిచి వెళ్లాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 50 మంది దుర్మరణం
తాజా ఘర్షణలో 9 మంది మరణించగా 14 మంది గాయపడ్డారని థాయ్ సైన్యం నివేదించింది. సిసాకెట్ ప్రావిన్స్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆరుగురు మరణించగా, సురిన్ మరియు ఉబోన్ రాట్చథానిలో మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Students Study Tips: విద్యార్థులు పరిక్షల్లో టాప్ చేయాలంటే వీటిని పాటిస్తే సరి.. మీరే బెస్ట్.!
ఇక థాయ్‌లాండ్ దురాక్రమణపై చర్య తీసుకోవాలని కంబోడియా ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే థాయ్‌లాండ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. థాయ్‌లాండ్ తీవ్రమైన దురాక్రమణలకు పాల్పడుతుందని కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ పేర్కొన్నారు. యూఎన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే కంబోడియా-థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్ర కావడంతో ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే కంబోడియా సైనిక లక్ష్యాలపై థాయ్‌లాండ్ జెట్‌లు దాడి చేశాయి. గురువారం నాడు థాయ్ ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్ నుంచి ఆరు జెట్ విమానాలు మోహరించినట్లు థాయ్ సైన్యం ధృవీకరించింది.