చైనా వేదికగా టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక సమావేశం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపించారు. ఇక ఈ సమావేశంలో ఐదు ఫొటోలు హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం అవి ట్రెండింగ్‌గా మారాయి. ప్రపంచానికి ఒక సందేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సమావేశానికి ముందు ఆయా దేశాధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ చాలా సేపు ముచ్చటించారు. ముగ్గురూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహం కనిపించారు. ఆద్యంతం మోడీ నవ్వుతూ కనిపించారు. ఇక మోడీ-పుతిన్ అయితే ఆలింగనం చేసుకుని షేక్హ్యాండ్లు ఇచ్చుకున్నారు.
ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు నిలబడుతుండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లైన్లో నిలబడి ఉన్నారు. కానీ మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పుతిన్‌తో ఏదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. షెహబాజ్ మౌనంగా అలా ఉండిపోయారు. గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా పాక్ ప్రధాని వైపు చూసేందుకు ఇష్టపడలేదు. మళ్లీ ముగ్గురూ కలిసి సంభాషించుకున్నారు.
ఇక ఎస్సీవో సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చల కోసం మోడీ-పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇద్దరం ఒకే కారులో ప్రయాణించినట్లు మోడీ పేర్కొన్నారు. పుతిన్‌తో సంభాషణలు ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. మోడీ-పుతిన్ ఉపయోగించిన కారు చైనా జాతీయ గౌరవంతో ముడిపడి ఉన్న కారు. దీన్ని అగ్ర నాయకులు, ప్రముఖుల కోసమే రూపొందించిన కారు.

ఇక ఆయా దేశాధి నేతల కుటుంబాలతో జిన్‌పింగ్ ఫొటోలు దిగారు. అనంతరం అందరూ కలిసి అధికారికంగా ఒక గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో షెహబాజ్ షరీఫ్‌ను పట్టించుకోకుండా పుతిన్ వెళ్లిపోతుంటే.. షెహబాజే పరిగెత్తుకుంటూ వచ్చి పుతిన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనిపై షరీఫ్‌పై భయంకరంగా ట్రోలింగ్ నడిచింది.

ఇదిలా ఉంటే శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు మోడీ కరచాలనం ఇచ్చారు. వీపు తట్టి పలకరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ.. పాకిస్థాన్ వైపు నిలబడింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారాయి. బాయ్‌కట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో నినాదం నడిచింది. పాక్ ప్రధానిని తప్పించుకున్న.. టర్కీ అధ్యక్షుడితో మాత్రం తప్పించుకోవడం కుదరక షేక్‌హ్యాండిచ్చారు.
