46 Girls Among 53 Killed In Kabul Classroom Bombings: రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నగరంలో ఇటీవల ఒక ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే! ఓ విద్యా కేంద్రంలోని తరగతి గదిలో జరిగిన ఆ దాడిలో.. తొలుత 19కి పైగా మరిణించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. తాజాగా మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. ఆ సంఖ్య 53కి చేరినట్టు.. అఫ్గాన్‌లోని ఐరాస సహాయ మిషన్ (UNAMA) అధికారికంగా వెల్లడించింది. అందులో.. 46 మంది బాలికలు, యువతులే ఉన్నారని పేర్కొంది. 110 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది. ఈ ఘటనపై తమ మానవ హక్కుల బృందం డాక్యుమెంట్ చేస్తూనే ఉందని.. వాస్తవాలను ధ్రువీకరించి సమాచారాన్ని అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
కాగా.. అక్టోబర్ 30వ తేదీన కాబూల్ నగరానికి సమీపంలో దశ్త్-ఏ-బార్చి ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అక్కడ మైనార్టీ హజారా కమ్యూనిటీ ప్రజలు అధికంగా ఉంటారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందడంతో పాటు 27 మంది గాయపడినట్టుగా.. ఘటన జరిగినప్పుడు పోలీసులు తెలిపారు. అదే సమయంలో.. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఐరాస సహాయ మిషన్ అధ్యయనం చేసింది. ఇప్పుడు ఆ వివరాలను ట్విటర్‌లో వెల్లడించింది. ఇదిలావుండగా.. అమెరికా తన బలగాల్ని ఉపసంహరించడంతో, తాలిబన్లు ఆప్ఘన్ ప్రభుత్వాన్ని కూల్చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ హజారా కమ్యూనిటీపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.
దశ్త్-ఏ-బార్చి ప్రాంతంలో ఇలాంటి దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు. తాలిబన్లు అధికారంలోకి రావడానికి ముందు.. గతేడాది మే నెలలో కూడా మూడుసార్లు బాంబు దాడులు జరిగాయి. ఆ దాడులు పాఠశాలకు సమీపంలో చోటు చేసుకోగా.. ఆ దాడుల్లో 85 మంది అమ్మాయిలు చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు.