ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) ఘోర విషాదం చోటుచేసుకుంది. నూరిస్తాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 25 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో హిమపాతాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొండచరియలు విరిగిపడి 25 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్ నేతృత్వంలోని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడ్డ మరో 10 మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయని.. దీంతో నూరిస్తాన్, కునార్, పంజ్‌షీర్ ప్రావిన్స్‌లలో రోడ్‌బ్లాక్‌లు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అలాగే పలు నివాసాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రావిన్స్‌లో మంచు హిమపాతం సంభవించి ఫలితంగా ఐదుగురు కార్మికులు అదృశ్యమయ్యారని వెల్లడించారు. వీరిలో ఇద్దరు మైనర్లు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆప్ఘనిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. అలాగే మానవతా సంక్షోభం కారణంగా దేశ పౌరులు తమ అవసరాలను తీర్చుకోలేక అల్లాడిపోతున్నారు. దీంతో ప్రజలు పేదరికంతో సతమతమవుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటుంది. 2021లో ఆఫ్గనిస్థాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో ఆర్థిక సంక్షోభం మరింత నిరుత్సాహానికి గురి చేసింది.