20 Killed After Bus Falls Into Water-Logged Ditch In Pakistan’s Sindh: పాకిస్తాన్ దేశంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్ సింధు ప్రావిన్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నీటి గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. 14 మంది గాయపడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారీ వరదల్లో పాకిస్తాన్ లోని రహదారులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో నీటితో పెద్ద పెద్ద కాలువలు, గోతులు ఏర్పడ్డాయి. తాజా ఇటువంటి గోతిలోనే బస్సు పడిపోయి ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికార ఖాధీమ్ హుస్సేన్ వెల్లడించారు. డ్రైవర్ రోడ్డు మళ్లింపు గుర్తును చూడకుండా నేరుగా 25 అడుగుల లోతైన గుంతలోకి బస్సును పోనివ్వడంతో ప్రమాదం జరిగింది.
ప్రపంచంలోనే అధ్వాన్నం అయిన రోడ్ నెట్ వర్క్ ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచంలోనే మూడవ అత్యధిక మరణాలు పాకిస్తాన్ లోనే సంభవిస్తున్నాయి. నిర్లక్షమైన డ్రైవింగ్, రోడ్డు వ్యవస్థ బాగా లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఇలాగే పెద్ద ప్రమాదలు జరిగి పదులు సంఖ్యలో ప్రమాణికులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా కొండప్రాంతాలతో, ఇరుకు రోడ్లతో నిండి ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఎక్కువగా ప్రయాణికులు వాహనాలు లోయల్లో పడిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరుగుతుంటుంది. ఈ ఏడాది రుతుపవన కాలం ప్రారంభంలో పాకిస్తాన్ లో భారీ వరదలు సంభవించాయి. దీంతో బలూచిస్తాన్, సింధు ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ మూడువంతుల భూభాగం నీటితో నిండిపోయి అపార నష్టాన్ని మిగిల్చింది.