Georgia: జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్‌గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్‌లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు. అయితే, గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో వారంతా అక్కడ సిబ్బందిగా కొనసాగుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మరణించినట్లు మా దృష్టికి వచ్చిందని పేర్కొనింది. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరణించిన వారి ఫ్యామిలీస్ తో మాట్లాడుతున్నాం.. వారికి సాధ్యమైనంతగా సహాయం చేసేందుకు ట్రై చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
Read Also: One Nation One Election: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
కాగా, డిసెంబర్ 14వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వారిపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని జార్జియా అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మరణించినట్లు పోలీసులు తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, రెస్టరెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రైమరీ దర్యాప్తులో బాధితుల బెడ్ రూమ్స్ సమీపంలో ఒక పవర్ జనరేటర్‌ను గుర్తించారు పోలీసులు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో దాన్ని అక్కడికి మార్చినట్లు సమాచారం. అయితే, 12 మంది మృతికి కచ్చితమైన కారణంపై ఫోరెన్సిక్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు జార్జియా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.