అక్కినేని నాగ చైతన్య – డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. వైజాగ్ షెడ్యూల్ తర్వాత ఇటలీలో జరపవలసిన షూటింగ్ ను కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసుకున్నారని ఆ మధ్య వినిపించింది. అయితే ‘థ్యాంక్యూ’ యూనిట్ మాత్రం ధైర్యంగా ఇటలీలో ల్యాండ్ అయింది. ఈ చిత్రానికి పని చేస్తున్న సీనియర్ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ షూటింగ్ లొకేషన్స్ తో పాటు… నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ ఫోటోస్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ పాండమిక్ టైమ్ లో జాగ్రత్తలు తీసుకుని షూట్ చేస్తున్నామన్నారు. 15 రోజుల పాటు ఇటలీలోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరపాల్సి ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. బివిఎస్ రవి కథతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు వీరాభిమానిగా నాగచైతన్య కనిపించబోతున్నాడట.