Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rabies: అర్ధరాత్రి… ఓ 11ఏళ్ల బాలుడు నిద్రపోతున్నాడు. హఠాత్తుగా… ముఖంపై ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా కళ్లు తెరిచాడు. చూసి షాక్ అయ్యాడు. తన ముఖంపైనే ఒక గబ్బిలం కూర్చుని ఉంది. భయంతో వెంటనే ఓ చేత్తో దాన్ని దూరంగా విసిరేశాడు. శరీరంపై ఎక్కడా గాయం లేదు. రక్తం లేదు. నొప్పి కూడా లేదు. గబ్బిలం కూడా మామూలుగానే కనిపించింది.
అతని తండ్రి దాన్ని ఒక బాక్స్‌లో బంధించి బయట వదిలేశాడు. ఏం కాలేదులే అనుకుని కుటుంబమంతా ఆ విషయాన్ని మర్చిపోయింది. కానీ… ఆ రాత్రే ఆ బాలుడి శరీరంలో కనిపించని ఒక అతిథి ప్రవేశించింది. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వైరస్లలో ఒకటైన రేబీస్ వైరస్ ఆ బాలుడి బాడీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read
- Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
ఆ ఘటన జరిగిన 18 రోజుల పాటు బాలుడు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇంట్లో ఎవరికీ చిన్న అనుమానం కూడా రాలేదు. కానీ 19వ రోజు… అతని ముఖంలో విచిత్రమైన జలదరింపు మొదలైంది. కొద్దిసేపటికే వాంతులు, ఆకలి పూర్తిగా తగ్గిపోవడం, ముఖం వాపు కనిపించాయి. వైద్యులు మొదట సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకున్నారు. కానీ ప్రతి గంట గడిచేకొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారింది.
నీళ్లు కూడా మింగలేకపోయాడు. మాటలు తడబడటం ప్రారంభమైంది. కళ్ల ముందు లేనివి కనిపిస్తున్నాయని చెప్పడం మొదలుపెట్టాడు. చివరకు పరీక్షలు చేశారు. వచ్చిన రిపోర్ట్ చూసి వైద్యులే షాక్‌కి గురయ్యారు. మెడికల్ టెస్టుల్లో రేబీస్ అని తేలింది. ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడినా… చివరకు ఆ బాలుడి ప్రాణాలు నిలవలేదు. ఒక గాయం కూడా కనిపించలేదు… ఒక్క చుక్క రక్తం కూడా రాలేదు…కానీ ఒక చిన్న గబ్బిలం… ఒక కుటుంబం జీవితాన్నే విషాదంలోకి నెట్టేసింది. 1967 తర్వాత కెనడాలోని అంటారియోలో నమోదైన మొట్టమొదటి మానవ రేబీస్ కేసు ఇదే. ఈ కేసును వివరాలు కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించడంతో ప్రపంచవ్యాప్తంగా వైద్యులు మరోసారి అప్రమత్తమయ్యారు.
గబ్బిలం కరిస్తే మరింత డేంజరా?
నిజానికి కుక్క కరిస్తే పెద్ద గాయం కనిపిస్తుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనే ఆలోచన వస్తుంది. కానీ గబ్బిలం అలా కాదు. దాని దంతాలు సూది కొన కంటే కూడా చాలా సన్నగా ఉంటాయి. అది కొరికినా చాలాసార్లు గాయం కనిపించదు. ఒక్క చుక్క రక్తం కూడా రాకపోవచ్చు. నిద్రలో ఉన్నవారికి అయితే కొరికిన విషయం కూడా తెలియకపోవచ్చు. అదే ఈ బాలుడి విషయంలో జరిగింది.
రేబీస్ ఎందుకు ప్రమాదకరం?
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మనలో చాలామంది వైరస్ అంటే రక్తంలో తిరుగుతుందని అనుకుంటారు. కానీ రేబీస్ అలా కాదు. ఇది దొంగ తెలివితేటలున్న వైరస్. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్తంలో ప్రయాణించదు. మన నరాలను రహదారిలా ఉపయోగించుకుంటూ నెమ్మదిగా మెదడు వైపు ప్రయాణిస్తుంది. అందుకే మొదటి కొన్ని రోజులు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత వైరస్ స్లోగా తన గమ్యానికి చేరుకుంటూ ఉంటుంది. మెదడుకు చేరిన తర్వాత మాత్రం అసలు భయం మొదలవుతుంది. జ్వరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, లేనివి కనిపిస్తున్నాయని చెప్పడం లాంటివి జరుగుతాయి. చివరకు మెదడు పూర్తిగా దెబ్బతిని శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
అందుకే రేబీస్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే గబ్బిలాలే ఎందుకు ఇంత ప్రమాదకరంగా ఉంటాయనే దానికి సమాధానం వాటి పరిణామ చరిత్రలో ఉంది.
భూమిపై కోట్ల ఏళ్లుగా జీవిస్తున్న గబ్బిలాలు ప్రస్తుతం 1,400కుపైగా జాతుల్లో ఉన్నాయి. ఇవి ఎగరగలిగే ఏకైక క్షీరదాలు. ప్రతిరోజూ వందల కిలోమీటర్లు ఎగురుతూ వేలాది గబ్బిలాలతో కలిసి గుహల్లో జీవిస్తాయి. ఈ కారణంగా ఎన్నో వైరస్లు వాటి శరీరంలో సహజంగానే ఉంటాయి. అయితే ఆ వైరస్లు గబ్బిలాలను పెద్దగా అనారోగ్యానికి గురిచేయవు. ఎందుకంటే వాటి రోగనిరోధక వ్యవస్థ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే రేబీస్ మాత్రమే కాదు… నిపా, హెండ్రా, మార్బర్గ్, కరోనా కుటుంబానికి చెందిన వైరస్ల విషయంలో ప్రపంచ శాస్త్రవేత్తలు గబ్బిలాలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 59 వేల మంది రేబీస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ మరణాలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే జరుగుతున్నాయి. భారత్‌లో ఎక్కువ కేసులకు వీధి కుక్కలే కారణమవుతుంటే, ఉత్తర అమెరికాలో మాత్రం గబ్బిలాల వల్లే ఎక్కువ మానవ రేబీస్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కెనడా ఆరోగ్య శాఖ, అమెరికా సీడీసీ అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. గబ్బిలం నేరుగా మీ శరీరాన్ని తాకినా, నిద్రలో మీ ముఖంపై కనిపించినా, గదిలో గబ్బిలం కనిపించినా, గాయం కనిపించకపోయినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
ఎందుకంటే రేబీస్ విషయంలో సమయమే ప్రాణాలను నిర్ణయిస్తుంది. రేబీస్ లక్షణాలు మొదలయ్యే ముందు వ్యాక్సిన్, అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకుంటే దాదాపు 100శాతం వరకు ఈ వ్యాధిని అడ్డుకోవచ్చు. కానీ… ఒక్కసారి లక్షణాలు మొదలైతే ప్రపంచంలో అత్యాధునిక వైద్యం కూడా చాలా సందర్భాల్లో చేతులెత్తేస్తుందని గుర్తుపెట్టుకోండి.
తాజావార్తలు
-
Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
-
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్‌చాట్ వైరల్
-
Abrar Ahmed: కావ్య మారన్‌కు బిగ్ షాక్.. చిక్కుల్లో పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. రూ. 2.3 కోట్లు స్వాహా!
-
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
-
Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..