Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక కొండ కదిలింది. మంచు, రాళ్లు, మట్టి కలిసి కిందికి దూసుకొచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఒక నది దారి మారింది. ఆ తర్వాత నీరు, బురద, బండరాళ్లు కలిసి లోయ వైపు పరిగెత్తాయి. వంతెనలు మాయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఆగస్టు 26న నేపాల్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు భారత్‌కు ఒక తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఇదే హిమాలయాలు. ఇదే మంచు. ఇదే కొండలు. ఇదే మారుతున్న వాతావరణం. మరి హిమాలయాల్లో ఇలాంటి విపత్తుకు ఇండియా ఎంత దగ్గరగా ఉంది?
నేపాల్‌లో టిబెట్ సరిహద్దు సమీపంలో భారీ మంచు, అవలాంచ్ ఒక్కసారిగా విరిగిపడింది. అది భోటే కోషి నదీ వ్యవస్థలోకి దూసుకెళ్లడంతో నది ప్రవాహం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత నీరు, మట్టి, రాళ్లు కలిసి లోయల వైపు విధ్వంసకర వేగంతో పరిగెత్తాయి.
బెట్రావతిలోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం శిథిలాల కింద మునిగిపోయిన దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. అయితే నేపాల్ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించిన విషయం మరోకటి ఉంది. విపత్తు జరిగిన ప్రాంతంలోనే సుమారు 20.25 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త సరస్సు ఏర్పడింది. అంటే కొండపై నుంచి విరిగిపడిన మంచు, రాళ్లు, మట్టి ఒకచోట పేరుకుని నీటికి సహజమైన అడ్డంకిలా మారాయి. అక్కడ నీరు మరింతగా చేరితే మరో ప్రమాదం పుట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ దృశ్యాన్ని భారత హిమాలయాలతో పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వరకు వేలాది హిమనదులు, మంచు సరస్సులు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమనదులు వెనక్కి తగ్గుతున్నాయి. కొన్ని సరస్సులు విస్తరిస్తున్నాయి. పర్వత వాలులు కూడా అనేక ప్రాంతాల్లో అస్థిరంగా మారుతున్నాయి.
Also Read
హిమాచల్ ప్రదేశ్‌లో ఐఐటీ మండీ పరిశోధకులు 2015 నుంచి 2025 వరకు దాదాపు 2,000 సరస్సులను పరిశీలించారు. వాటి పరిమాణం, నీటి చేరిక, సరస్సులను నిలబెట్టే సహజ అడ్డంకుల బలాన్ని అధ్యయనం చేశారు. ఈ పరిశీలనలో సుమారు 9 సరస్సులు అత్యంత కీలకమైనవి.. అంతేకాదు ప్రమాదకరమైనవిగా పరిశోధకులు గుర్తించారు.
నిజానికి ఒక హిమనదం విరిగిపడి సరస్సులో పడితే భారీ అల ఏర్పడొచ్చు. కొండచరియలు నదిని అడ్డుకుంటే తాత్కాలిక సరస్సు తయారవుతుంది. భారీ వర్షం ఆ అడ్డంకిని బలహీనపరచొచ్చు. చివరికి ఒక్కసారిగా నీరు విడుదలైతే దాని వెంట మట్టి, బండరాళ్లు, చెట్ల దుంగలు కూడా లోయల్లోకి దూసుకెళ్తాయి. భారత్ ఇప్పటికే ఇలాంటి హిమాలయ విపత్తులను చూసింది. 2021లో చమోలీ, 2023లో సిక్కింలో సౌత్ లోనాక్ సరస్సు ఉప్పొంగిన ఘటన మీకు గుర్తిండే ఉంటుంది కదా.. ఆ తర్వాత ధారాలి వరదలు కూడా సంభవించాయి. ఇలా ప్రతి ఘటన ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. పర్వతాల్లో మొదలైన చిన్న మార్పు కింద ఉన్న గ్రామాలకు చేరేసరికి మహా విపత్తుగా మారవచ్చు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా పరిశీలించాల్సిన ప్రాంతంగా మారుతోంది. అక్కడ గుర్తించిన ప్రమాదకర సరస్సుల్లో సన్హాపో సరస్సు విస్తీర్ణం 2016లో 55.87 హెక్టార్లు ఉండగా, 2026లో 87.02 హెక్టార్లకు పెరిగింది.
జూన్ 2026లో చేసిన తాజా పరిశీలనలో అది 88.81 హెక్టార్లుగా నమోదైంది. ఇక్కడే భారత్‌కు నేపాల్ ఘటన ఇచ్చే అసలు హెచ్చరిక ఉంది. రేపు నేపాల్‌లో జరిగిన సంఘటనను అచ్చం అలాగే భారత్‌లో ఊహించాల్సిన అవసరం లేదు.
అయితే భారత హిమాలయాలకు తమకంటూ ప్రత్యేకమైన ప్రమాద ప్రాంతాలు ఉన్నాయి. వాటిని ముందే గుర్తించడం అత్యవసరం. ఒక సరస్సు ఎంత పెద్దదవుతోంది? దాన్ని అడ్డుకుంటున్న సహజ గట్టు ఎంత బలంగా ఉంది? అది విరిగితే నీరు ఏ లోయలోకి వెళ్తుంది? ఆ మార్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు విపత్తు వచ్చిన తర్వాత వెతికితే చాలా ఆలస్యం అవుతుంది. ఉపగ్రహాలు పర్వతాలపై ప్రతి మార్పును గమనించాలి. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో భూస్థాయి సెన్సర్లు ఏర్పాటు చేయాలి. సరస్సు పగిలితే వరద ఎంత వేగంగా, ఎంత దూరం ప్రయాణిస్తుందో ముందుగానే మోడలింగ్ చేయాలి. గ్రామాలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే హిమాలయాల్లో ప్రమాదం ఎక్కడ మొదలవుతుందో మన కళ్లకు కనిపించకపోవచ్చు.
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న మంచు ముక్క విరిగిపడటం మొదలై, చివరికి ఒక నది మొత్తం రూపాన్ని మార్చేయొచ్చు. అప్పుడు ఇండియాకు కూడా నేపాల్‌కు వచ్చిన పరిస్థితి రావచ్చు..అందుకే ప్రభుత్వాలు నేపాల్ నేర్పిన పాఠాల నుంచి ఇప్పటికైనా మేల్కోవాలి.. లేదంటే అంతే సంగతి!
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?