భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే నాలుగేళ్ల చిన్నారి గీసిన ఓ డ్రాయింగ్ పోలీసులకు ఆస్త్రంగా మారింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సోనాలి బుధోలియా (27), సందీప్ బుధోలియా భార్య భర్తలు. వీళ్లకు నాలుగేళ్ల దర్శిత అనే కుమార్తె ఉంది. ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలోని పంచవతి శివ్ పరివార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం సోనాలి బుధోలియా అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉంది. భర్త, అత్తమామలు.. పోలీసులకు ఫోన్ చేసి సోనాలి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారి దర్శితను పోలీసులు విచారించారు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ కొట్లాడుకుంటారని.. తన తండ్రి చంపి ఉరివేశాడని తెలిపింది. అంతేకాకుండా ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసి చూపించింది. డ్రాయింగ్‌లో తలకు ఉరివేసినట్లుగా బొమ్మ గీసింది. దీంతో భర్తే.. ఆమెను చంపి ఉరివేసినట్లుగా పోలీసులు అనుమానించారు. చంపేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
తన తల్లిని ముట్టుకుంటే తనను కూడా అలానే చంపేస్తానని తండ్రి బెదిరించాడని దర్శిత మీడియాతో పేర్కొంది. తన తల్లిని చంపేస్తానని తండ్రి ఎప్పటి నుంచో బెదిరిస్తున్నాడని ఆరోపించింది. చిన్నారి మీడియాతో చెప్పిన మాటలను వాంగ్మూలంగా తీసుకున్నారు. సోనాలి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త ఫోన్ చేశాడని.. కానీ సంఘటనాస్థలికి వచ్చాక పరిస్థితి ఆ విధంగా లేదని పోలీసులు పేర్కొన్నారు.
కుమార్తె మరణవార్త తెలిసి సోనాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి కన్నీటిపర్యంతం అయ్యారు. సంజీవ్ త్రిపాఠిది మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లా. 2019లో సోనాలిని.. సందీప్‌కు ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు లేవని వాపోయాడు. పెళ్లికి కట్నంగా రూ.20లక్షలు ఇచ్చామని.. అయినా డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారని తెలిపాడు. కారు కొనేందుకు డబ్బు అడిగితే లేవని చెప్పినట్లు గుర్తుచేశారు. అప్పటి నుంచి తమ కుమార్తెను ఇబ్బంది పెడుతుంటే.. పోలీసులను ఆశ్రయించామన్నారు. తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి వచ్చినట్లు చెప్పారు.
ఇక సోనాలి.. ఆడపిల్లకు జన్మనివ్వడంతో సమస్య మరింత జఠిలమైందని.. భర్త, అత్తమామలు.. మగ పిల్లాడు కావాలని వేధించేవారన్నారు. సోనాలిని ఆస్పత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్తే.. తానే డబ్బులు చెల్లించి బయటకు తీసుకొచ్చినట్లు సంజీవ్ త్రిపాఠి తెలిపారు. సోనాలిని ఇంటికి తీసుకెళ్లాక.. దర్శితను చూసేందుకు సందీప్ రాలేదని.. నెల తర్వాత ఎప్పుడో వచ్చాడని సంజీవ్ పేర్కొన్నారు. ఇటీవల సోనాలి.. ఝాన్సీలోని సమతార్‌లో బంధువు వివాహానికి వెళ్లగా.. సందీప్ ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాడని సంజీవ్ తెలిపారు. ఇక సోమవారం భర్త ఫోన్ చేసి.. సోనాలి ఆరోగ్యం బాగోలేదని చెప్పారని.. అంతలోనే మరో కాల్ చేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పారని సంజీవ్ కన్నీటిపర్యంతం అయ్యారు.
సోనాలి మృతదేహాన్ని పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నివేదిక తర్వాత సోనాలి మరణంపై క్లారిటీ వస్తుందని కొత్వాలి నగర పోలీసు అధికారి రాంవీర్ సింగ్ తెలిపారు.