పింపుల్స్.. యువతులకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఈ మొటిమలు తమ ముఖాన్ని అందవిహీనంగా తయారు చేస్తాయి కాబట్టి.. వీటి విషయంలో అమ్మాయిలు చాలా సీరియస్‌గా ఉంటారు. కొందరైతే, ఒక్క చిన్న మొటిమ వచ్చినా ఇంటి నుంచి బయటకు రారు. అయితే.. ఓ అమ్మాయికి ఎన్ని చికిత్సలు చేయించినా మొటిమలు పోకపోవడం, వాటి వల్ల పెళ్ళి కూడా అవ్వకపోవడంతో.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో నివసించే ఓ యువతికి ముఖం నిండా పింపుల్స్ వచ్చాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా.. అవి తగ్గలేదు. ఆ పింపుల్స్ వల్ల ఆమె ముఖం అందవిహీనంగా తయారైంది. ఆమెతో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడేవారు. పెళ్ళిచూపులకు వచ్చిన వాళ్ళు సైతం, ఆ పింపుల్స్ చూసి రిజెక్ట్ చేశారు. ఎన్ని సంబంధాలు చూసినా.. ప్రతిఒక్కరూ పింపుల్స్‌ని కారణంగా చెప్పి, అమ్మాయిని తిరస్కరించారు. దీంతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. తీవ్ర ఒత్తిడికి గురైంది. అసలు ఇలాంటి బ్రతుకు వద్దని నిర్ణయించుకుంది.
సోమవారం నాడు ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళడంతో, ఆ యువతి తన గదిలోకి వెళ్ళి గెడియ పెట్టుకుంది. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన కుటుంబీకులు, డోర్ ఎంతసేపు కొట్టిన తీయకపోవడంతో కిటికిలో నుంచి చూశారు. అప్పుడు ఆమె ఉరికి వేలాడుతూ విగత జీవిగా కన్పించింది. వెంటనే డోర్ పగలగొట్టి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.