Honey Trap: ఇవి మంచితనానికి రోజులు కావని అంటుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఒక ఉదంతం వెలుగు చూసింది. కొడుకుకి క్యాన్సర్ వ్యాధి ఉందని ఓ ముసలాయనని ముగ్గులోకి దించిన ఒక మహిళ.. ఆయన్ను హనీట్రాప్ ఉచ్చులో బిగించి, లక్షలకి లక్షలు కాజేసింది. అప్పటికీ దాహం తీరక మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో.. చివరికి ఆయన పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అలా ఆ మహిళ అడ్డంగా బుక్కైంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
యశ్వంతపురలో ఉంటున్న ఒక ముసలాయన (60) బాగా డబ్బున్నవాడు. ఈయనకు గతంలో ఒక మహిళతో పరిచయం ఉంది. ముసలాయన బాగా రిచ్ అనే విషయం తెలిసిన ఆ మహిళ, ఆయన వద్ద నుంచి డబ్బులు కొట్టేసేందుకు ఒక నాటకం ఆడింది. తొలుత తన అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి ఉందని, చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరింది. దీంతో ఆయన కరిగిపోయి రూ.5 వేలు ఇచ్చాడు. ఇలా వేల రూపాయలతో వర్కౌట్ అవ్వదని భావించిన ఆ మహిళ.. మరో పెద్ద స్కెచ్ వేసింది. ఆయన్ను ముగ్గులోకి దింపి, శారీరకంగా దగ్గరైంది. ఒక హోటల్‌కి తీసుకెళ్లి.. ఆయనతో రాసలీలలు కొనసాగించింది. ఈ రాసలీలల్ని తన సోదరి చేత సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయించింది.
అంతే.. వారం రోజుల తర్వాత ఆ వీడియోలని ముసలాయనకి పంపించి, బెదిరింపులకు పాల్పడ్డం మొదలుపెట్టింది. తనకు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోల్ని వైరల్ చేస్తానని హెచ్చరించింది. తన పరువు పోతుందన్న భయంతో.. ఆ ముసలాయన వారి బెదిరింపులకి లొంగాడు. ఇంకేముంది.. దశలవారీగా వాళ్లు ఆయన వద్ద నుంచి రూ.82 లక్షలు గుంజారు. అయినా వారి వేధింపులు ఆగలేదు. మరో రూ.40 ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే అత్యాచారం కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో.. ఆ ముసలాయన పోలీసుల్ని సంప్రదించాడు. తమపై కేసు పెట్టాడన్న విషయం తెలిసి.. ఆ మహిళలు పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.