Tagore Movie Scene Repeated in Telangana Private Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్‌లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఆ సినిమా సీన్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో కూడా రిపీట్ అయ్యింది. చనిపోయిన పేషెంట్ బ్రతికే ఉందని నమ్మించి, లక్షలు కొట్టేయాలని చూశారు. చివరికి అడ్డంగా బుక్కయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళను ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిజేరియన్ ద్వారా డెలివరీ చేయగా.. ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ.. ఆమె ఆరోగ్యం క్షణించడంతో కాసేపటికే మరణించింది. అయితే, ఈ విషయాన్ని వైద్యులు దాచిపెట్టారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. చెప్పినట్లుగానే ఆమెను హైదరాబాద్‌కి తరలించి.. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందుతోందని, త్వరగానే కోలుకుంటోందని కూడా చెప్పారు. డాక్టర్లను జనాలు దేవుళ్లకి సమానంగా పూజిస్తారు కదా.. అందుకే వాళ్లు చెప్పిన ప్రతీదీ నమ్మేశారు.
అయితే.. కొంతసేపు తర్వాత ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. ఆమెను కాపాడేందుకు తాము సాయశక్తులా ప్రయత్నించామని, కానీ తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. వైద్యుల తీరుపై బంధువులకు అనుమానం రావడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దే ఆందోళనకు దిగారు. గొడవ పెద్దదై తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో.. తాము రూ. 8 లక్షలు ఇస్తామని ఆ ఆసుపత్రి సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.