మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు దేశంలోనే ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. మనదేశంలో కొన్నిచోట్లు అవి హింసాత్మకంగానూ మారాయి. నుపుర్ శర్మ వ్యాఖ్యలన సమర్థించిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ టైలర్‌ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను మరవకముందే ఇదే తరహాలో మరో హత్య మహారాష్ట్రలో జరిగింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్‌ను షేర్ చేసిన మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మెడికల్ షాప్ యజమానిని కత్తితో నరికి చంపారు.
54 ఏళ్ల ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే అమరావతిలో ఓ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఆయన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే, ఆయన అనుకోకుండా ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేసినట్టు కొత్వాలి పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన జున్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. ఆ రోజు ఎప్పటిలాగే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే తన మెడికల్ షాప్ మూసేసి ఇంటికి బయల్దేరాడు. షాప్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. ఆయనతోపాటు మరో ద్విచక్రవాహనంపై ఆయన భార్య వైష్ణవి, వారి కుమారుడు సంకేత్ (27) బయల్దేరారు. వారు తమ ఇంటికి వెళ్లుతుండగా మహిళా కాలేజీ గేటు సమీపించిన తర్వాత ఇద్దరు దుండగులు వెనక నుంచి బైక్ పై వచ్చి వారిని అడ్డుకున్నట్టు అధికారి తెలిపారు. ఆ బైక్ పై నుంచి ఓ యువకుడు దిగి కత్తితో కొల్హే మెడ వెనక వైపును పొడిచినట్టు వివరించారు. ఆ వెంటనే స్పాట్ నుంచి పారిపోయినట్టు పేర్కొన్నారు. ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. సంకేత్ వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే మరణించినట్టు వివరించారు.
Crime: నుపుర్‌శర్మకు మద్దతు.. తలనరికి దారుణహత్య..
ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హేను హత్య చేయడానికి వాడిని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ సాలీ వెల్లడించారు. దీనికి కారణం ఉమేశ్ కొల్హే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లేనని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ ఘటన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.
జూన్ 21వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే హత్య కేసును మహారాష్ట్ర సర్కారు ఎన్ఐఏకు అప్పగించినట్లు రాష్ట్ర హోంమంత్రి కార్యాలయం ట్విట్టర్ వెల్లడించింది. హత్య వెనుక కుట్ర, సంస్థల ప్రమేయం,అంతర్జాతీయ సంబంధాలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతామని ట్వీట్‌లో తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.